అది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ ఫేక్ సమ్మిట్ – నారా లోకేశ్ ఫైర్
విశాఖ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జీఐఎస్ కార్యక్రమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పీలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా విశాఖపట్నంలో జరిగింది గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కాదని.. ఫేక్ సమ్మిట్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలను తరిమేసిన జగన్ కొత్త వాటిని ఏ విధంగా తీసుకొస్తారని ప్రశ్నించారు.
వైసీపీ యువతను మోసం చేస్తోంది..
ఆల్రెడీ ఒప్పందాలు జరిగిన కంపెనీలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుని ప్రజల్ని, యువతను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్.. గంజాయి ఫుల్ అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శించారు. దావోస్ చేసుకున్న ఒప్పందాలను మళ్లీ విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ పేరు పెట్టి కొత్తగా ఎంవోయూలు చేసుకున్నట్లు చూపించారని ఆయన అన్నారు. వైకాపా పాలనలో పీపీఏలు రద్దు చేయడంతోపాటు రాష్ట్రం నుంచి ప్రముఖ పరిశ్రమలను తరిమేశారన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత భారతి సిమెంట్ పరిశ్రమ మాత్రమే బాగుపడిందని ఎద్దేవా చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీకీ ఇతర ప్రాంతాలకంటే.. పెట్టుబడులు వచ్చాయన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీల పక్కన నిల్చుని తాను సెల్ఫీలు తీసుకుంటున్నానని… అదేవిధంగా వైసీపీ హయాంలో వచ్చిన కంపెనీల పక్కన నాయకులు నిల్చుని ఫొటోలు తీసుకోగలరా అంటూ ప్రశ్నించింది.
మంగళగిరిని టీడీపీ కంచుకోట చేస్తాం..
రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోట చేస్తామని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన జగన్‌కు సవాల్ విసిరారు. సొంత నియోజకవర్గాలు, కంచుకోటల్లో గెలుపొంది గొప్పలు చెప్పుకోవడం కాదని.. వైసీపీ గెలవని చోట పోటీ చేసి గెలిచే సత్తా జగన్‌కు ఉందా అని లోకేష్ ఫైర్ అయ్యారు. తాను చేసిన ఏ ఛాలంజ్ ని సీఎం జగన్ స్వీకరించలేదని లోకేష్ అన్నారు. ఎప్పుడూ గెలవని చోట జగన్ పోటీ చేయాలని లోకేష్ సూచించారు. తాను మంగళగిరిలో ఓడిపోయినా తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి తప్పకుండా గెలుపొందుతానని.. అదే ఛాలెంజ్ జగన్ కూడా స్వీకరించాలని.. తన కంచుకోట పులివెందుల వదిలి బయటికొచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు.