గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ..మంత్రివర్గంలో మార్పులు!

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ రాష్ట్ర గవర్నర్ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌తో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీపై అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంత్రి వర్గం నుంచి ముగ్గురు, నలుగురుని కేబినెట్‌ నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారని… ఈ అంశంపై గవర్నర్‌తో సీఎం చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతే కాకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆమెందించిన బిల్లుల గురించి గవర్నర్‌కు తెలియజేయనున్నారు సీఎం జగన్‌. అయితే ప్రధానంగా సీఎం జగన్‌ మాత్రం.. మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సమావేశం కానున్నారు. ప్రకాశం, విశాఖలోనూ జగన్ పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత గవర్నర్‌తో ఆయన సమావేశం కానున్నారు.

కేబినెట్‌లోకి వీరికి అవకాశం…
సీఎం జగన్‌ ఈ నెల 14న మంత్రి వర్గ సమావేశం నిర్వహించినప్పుడు పనితీరు ఆధారంగా ఇతర కారణాల వల్ల ముగ్గురు, నలుగురు మంత్రులను మార్చనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తుండగా.. ఈ మధ్యే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇప్పుడున్న జట్టులోంచి కొందర్ని తప్పించి కొత్తవాళ్లకు స్థానం కల్పిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకటి రెండు రోజులో పూర్తి క్లారిటీ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్‌, కౌరు శ్రీనివాస్‌తోపాటు తోట త్రిమూర్తులకు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

సామాజిక సమీకరణాలకు అనుగుణంగా..
కుల సమీకరణాలు, పనితీరు ఆధారంగా మంత్రి వర్గంలో కొందరిని తొలగించి.. కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత మంత్రి వర్గంలో ఉన్న దాడిశెట్టి రాజాని తొలగించి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులకు చోటు కల్పించే అవకాశం ఉంది. ఇక బీసీ సామాజిక వర్గం కింద కౌరు శ్రీనివాస్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని టాక్‌ నడుస్తోంది. చిలకలూరి పేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడదల రజనీని తప్పించి.. ఆమె స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే కేవలం ముగ్గురిని మాత్రమే తప్పిస్తారా లేదా ఆ సంఖ్య పెరుగుతుందా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఎక్కువ మందిని మార్చితే మళ్లీ పార్టీలో అసమ్మతి మొదలవుతుందని ఆలోచనల్లో కూడా జగన్ ఉన్నట్లు సమాచారం.

అసలే ఈ మధ్య కాలంలో అసంతృప్తులు పెరిగిపోతున్న టైంలో కేబినెట్ విస్తరణకు వెళ్తారా అనేది కూడా ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అలా వెళితే మార్పులు చేర్పుల్లో పదవులు రాని వారిని సైతం బుజ్జగించాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో రిస్క్‌ చేస్తారా లేదా అనేది మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే పాదయాత్ర టైంలో చాలా మంది నేతలకు చట్టసభల్లోకి తీసుకెళ్లి మంత్రులుగా చేస్తానంటూ సీఎం జగన్‌ మాట ఇచ్చారు. అలాంటి వ్యక్తుల్లో మర్రి రాజశేఖర్ ఒకరు. ఇన్నాళ్లకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం రాగా.. ఆయన్ని అయితే కచ్చితంగా మంత్రి వర్గంలోకి తీసుకుంటారని టాక్‌ నడుస్తోంది.