‘ఆస్కార్​ విజేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా?’

ఆస్కార్​ వేదికపై సత్తాచాటి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సినిమా ఆర్​ఆర్​ఆర్​. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకుని ఇండియన్ సినిమా చరిత్రలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేసిందో తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుని యావత్​ భారతాన్ని మురిపించింది. ఈ సందర్భంగా దేశం మొత్తం ఆర్​ఆర్​ఆర్​ టీమ్​కి అభినందలు తెలిపింది. తెలుగు ప్రేక్షకులు గర్వంతో ఉప్పొంగిపోయారు. ఇక ఈ పాటకు ప్రాణం పోసి ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్ లకు ప్రతిచోటా నీరాజనాలు పలుకుతున్నారు. అన్ని రంగాల వారు సన్మానాలు చేస్తూ ఈ చిత్రబృందాన్ని గౌరవిస్తున్నారు. అయితే, తాజాగా వారికి జరుగుతున్న సన్మానాలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కెఎస్.రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

‘ఆస్కార్ అవార్డులు అనేవి చాలా ప్రతిష్టాత్మకమైనవి. అలాంటి అరుదైన అవార్డులను అందుకున్న వారిని ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదు. వారికి ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. కేవలం స్పోర్ట్స్ లో గెలిచిన వారికే మర్యాదలు, గుర్తింపులు ఇస్తారా? సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అవార్డులను అందుకుంటే వారిని గుర్తించరా? ఇప్పటికైనా ఆస్కార్ విన్నర్స్ ను మనం గొప్పగా సన్మానించాలి’ అని అన్నారు. ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తమ శక్తిమేర ఆస్కార్ విజేతలను సన్మానించేందుకు ఏర్పాట్లు చేసినా అవేవీ సరిపోవని, యావత్ భారతదేశం గర్వించేలా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వేడుకలు జరపాలని కె.ఎస్.రామారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9న శిల్పకళావేదికలో తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో చంద్రబోస్, కీరవాణిలకు గౌరవ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఇక, ఈ సినిమాలో మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ రామ్​, భీమ్​గా తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను మెప్పించారు. ఆస్కార్​ వేడుకల్లో మెరిసిన వీరిని అంతర్జాతీయ మీడియా పొగుడుతూ ప్రత్యేకంగా కథనాలు ప్రచురించింది. ఇక, వీరికి జోడీగా బాలీవుడ్​ భామ ఆలియా భట్​, హాలీవుడ్​ సుందరి ఒలీవియా నటించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 12 వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది.