బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా? – వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని నీటి ప్రాజెట్టులు పూర్తి చేసినం.. ఇక నీళ్ల కష్టాలు లేవంటూ చిన్న దొర కేటీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి రూ.లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసి 57 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని.. కొత్తగా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఏ ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే విధంగా 33 ప్రాజెక్టులకు మహానేత దివంగత వైయస్ఆర్ శంకుస్థాపనలు చేశారని.. 2016 –17 నాటికే ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసే విధంగా పనులు సైతం వేగంగా జరిగాయన్నారు. అలీసాగర్, గుత్పా, గడ్డెన్న సుదవాగుల వంటి ప్రాజెక్టులు 2007లోనే పూర్తి చేశారన్నారు. దేవాదుల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు 70 శాతం, మిగిలిన ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తి కావొచ్చాయని.. అయితే 2009లో వైఎస్ఆర్ మరణానంతరం అప్పటి కాంగ్రెస్ కానీ… 2014లో అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె ఆరోపించారు.
10 శాతం పనులు కూడా పూర్తి చేయలేరా..
2015లో అసెంబ్లీ వేదికగా కేవలం రూ.8500 కోట్లు ఖర్చు చేస్తే 16 పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు, 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని సీఎం కేసీఆర్ అప్పట్లో చెప్పారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అయితే 90 శాతం పూరయిన ప్రాజెక్టుల్లో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసేందుకు అవసరం అయిన నిధులు విడుదల చేయకుండా జలయజ్ఞం ప్రాజెక్టులపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపెట్టారని.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తెలంగాణను ఎడారిగా మారిపోయిందన్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని నీతులు చెబుతున్న.. కేసీఆర్, కేటీఆర్ లకు ఈ సందర్భంగా షర్మిల సవాల్ విసిరారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి వాటిపై ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు తండ్రి కొడుకులు రాగలరా అని ఆమె ప్రశ్నించారు.
వీటిని పూర్తి చేస్తే తెలంగాణ సస్యశామలం..
కాళేశ్వరం కరెంట్ బిల్లులకు చెల్లించిన మేర నిధులను పెండింగ్లో ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ కేటాయిస్తే.. అవి పూర్తయ్యేవని వైఎస్ షర్మిల అన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు తట్టెడు మట్టి కూడ వేయలేదన్నారు. నల్గొండ జిల్లాలో SLBC, డిండి, బ్రాహ్మణ వెల్లేముల, ఉదయసముద్రం, అడవిదేవుల పల్లి, సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పూర్తి కాలేదన్నారు. పాలమూరు జిల్లాలో, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా ఫేజ్ 1, 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, భూత్పూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కొరాట, జగన్నాథపురం, కొమురంభీం, వార్థా , కుఫ్టి, చెన్నూరు లిఫ్, గూట్ డెం లిఫ్, ట్గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులకు అతీగతీ లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ 20,21,22 , లెండి ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్యాకేజి 9, సూరమ్మ చెరువు ప్రాజెక్టు, రోళ్లవాగు ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు. దీంతో పాటు పలు జిల్లాల్లో చిన్న చిన్న ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తయి.. చివరి దశలో ఉన్నాయని వాటిని పూర్తి చేస్తే.. దాదాపు 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.