రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం లేటైనా నో ఎంట్రీ…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఇంటర్‌మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో అధికారులు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభం అవుతుంది. అయితే.. ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని.. సంబంధిత అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుందని.. ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు పరీక్షకు అనుమతించనున్నారు. తప్పనిసరిగా 9 గంటలకు విద్యార్థులకు ప్రశ్నపత్రాన్ని అందజేయాలని ఇన్విజిలేటర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఒత్తిడి, ఆందోళన వద్దు..
కరోనా వల్ల గత రెండేళ్లుగా అరకొర సిలబస్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 2021, 2022లలో 70 శాతం సిలబస్‌తో పరీక్షలు జరగగా… రెండేళ్ల తర్వాత 100 శాతం సిలబస్‌తోపాటు గతంలో మాదిరిగా ఇప్పుడు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. ఇంటర్ విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని రెండు రాష్ట్రాల అధికారులు విద్యార్థులకు సూచించారు. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి.. పరీక్ష కేంద్రాల వద్ద ఉండాల్సిన తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర సౌకర్యాలపై సమీక్ష చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కేంద్రాలకు పిల్లలు సకాలంలో చేరేలా ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
ఓఎంఆర్ నింపేటప్పుడు జాగ్రత్త..
ఓఎంఆర్ పత్రం ఇవ్వగానే అందులో పేరు, సబ్జెక్టు తదితర అంశాలను సరిచూసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచించారు. జవాబుపత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలని అన్నారు. ఒక రోజు ముందుగా… ముఖ్యంగా నగరాల్లో పరీక్ష కేంద్రాలను చూసుకొని రావడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లోని కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వాటి చిరునామాలు తెలియక విద్యార్థులు అయోమయానికి గురై ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకొని నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలో విద్యార్థులు కుదిరితే ఆ సెంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెబుతున్నారు. కనీసం గంట ముందు కేంద్రం వద్దకు వెళ్లాలని నిపుణులు అంటున్నారు.