Summer: అమ్మో భ‌గ భ‌గ‌లు..!

హైదరాబాద్‌లో ఎప్పుడూ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వర్షాలు కురిసినా.. ఎండలు కాసినా అంతే తీవ్రతను చూపుతాయి. ఇక ఏడాది అయితే మాత్రం ఎండలు టారెత్తిస్తాయి అని వాతావరణ నిపుణుల హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఏప్రిల్‌ మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరుగుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈక్రమంలో ఎండలు విపరీతంగా పెరగడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇలా వివరించారు.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యింది ఇక్కడే..

తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతోపాటు, హైదరాబాద్‌ మహా నగరంలో కూడా ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తోంది. హైదరాబాద్‌లోని తిరుముల్‌గేరిలో గురువారం ఉష్ణోగ్రత 39.6 ° సెల్సియస్‌కు చేరుకుందని.. సైదాబాద్‌లో 39 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్‌డీపీఎస్‌ పేర్కొంది. ఇక కామారెడ్డి జిల్లా భిక్నూర్‌లో తెలంగాణలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మండలంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి తర్వాత నిర్మల్ లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 2 వరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 37 నుండి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. అయితే ఇదే క్రమంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా మోస్తారు నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురవవచ్చని చెబుతోంది. ఏప్రిల్ 2 వరకు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని.. ఈ తర్వాత మూడు రోజులు కురవవచ్చని పేర్కొంది.

ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి..
ఇప్పటికే తెలంగాణలోని సుమారు ఏడు జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్టు జారీ చేసింది. కానీ హైదరాబాద్‌లో ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఐఎండీ ప్రకారం.. హైదరాబాద్, TSDPS రెండింటి ద్వారా అందిన సూచనల మేరకు.. ఎండలు ముదురుతున్నాయని ఆ మేరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది. అవసరమైతేనే భయటకు రావాలని సూచిస్తోంది. గర్బిణులు, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని అంటోంది. తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు, ప్రధానంగా హైదరాబాద్‌లో రంజాన్ అంతటా ముస్లింలు ఉపవాసాలు ఉంటారు. ఇక ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో వారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. సెహ్రీ సమయంలో పుష్కలంగా నీరు తాగాలని.. చెబుతున్నారు. ఉపవాసం ఉండే వారు కనీసం రెండు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని లేదంటే శరీరం డీహైడ్రేడ్‌కు గురవుతుందని అంటున్నారు. దీంతోపాటు కాటన్ దుస్తులు ధరించడం వల్ల వేడిని కొంత వరకు ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు.

ఈ ఉష్ణోగ్రతలు క్రమంలో పెరగడానికి గల కారణాలను ఐఎండీ తెలియజేసింది. ప్రధానంగా వాతావరణంలో పెరుగుతున్న గ్రీన్‌హౌస్ వాయువు (GHG) ఉద్గారాలు ఓ కారణమని చెబుతోంది. దీంతోపాటు శిలాజ ఇంధనాలను కాల్చడం.. పారిశ్రామీకరణలో భాగంగా అక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్న ఉద్గారాలు.. చెట్లు సంఖ్య తగ్గిపోవడం వల్ల కూడా పర్యవరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇది గ్లోబల్ వార్మింగ్‌కు కారణంగా అని చెబుతున్నారు వాతావరణ నిపుణులు.