పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు.. కొత్త మార్పులతో ఇబ్బందులే!

ఏపీలో పదో తరగతి పరీక్షలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పేపర్లో స్వల్ప మార్పులు చేశారు. గత ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఆరు పేపర్లకే పరిమితం చేశారు. ఈ విధానంతో కొంత విద్యార్థులకు ఇబ్బందే అని చెప్పవచ్చు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఆరు పేపర్ల విధానం ఇప్పుడు విద్యార్థులకు కత్తి మీద సాములా మారింది. ఒకేసారి కొండంత సిలబస్ చదివి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులోనూ బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నాపత్రం ఉంటుంది. గత విద్యాసంవత్సరం ఎక్కువ మంది పదో తరగతి పరీక్ష తప్పడానికి పేపర్ల సంఖ్య తగ్గడమూ ఒక కారణమైంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు కరోనా సమయంలో వారి కింది తరగతుల్లో క్లాసులు కూడా సరిగా జరగలేదు. దీని కోసం ఉపాధ్యాయులు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో లేరని పలువురు చెబుతున్నారు.

సీబీఎస్ఈ విధానం కంటే కఠినంగా..
ఈ ఏడాది నిర్వహించనున్న పరీక్ష పత్రాల్లోని ప్రశ్నలను నాలుగు విభాగాలుగా విభజించారు. ఎనిమిది మార్కుల ప్రశ్నలకు తప్పా ఎక్కడా చాయిస్‌ లేకుండా ఇచ్చిన అన్ని ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అందులోనూ బిట్‌ పేపర్‌ లేకపోవడం విద్యార్థులకు కొంత ఇబ్బందికరమే. మొత్తం 32 ప్రశ్నలకు విద్యార్థులు ఇచ్చిన సమయంలో పరీక్ష రాయడం అంటే చాలా కష్టం. కొందరు నెమ్మదిగా రాసేవారు ఉంటారు. అలాగని ఫాస్టుగా రాస్తే రైటింగ్‌ సరిగా లేదని మార్కులు వేయరని విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి సీబీఎస్‌ఈ విధానంలో అయిదు పేపర్లు మాత్రమే ఉంటాయి. ఇందులో ఇంటర్‌నల్‌ మార్కులు 20, బిట్‌ పేపర్‌ 20 మార్కులకు ఉంటుంది. మిగిలిన 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. అయితే రాష్ట్ర బోర్డు నిర్వహిస్తున్న పరీక్షల్లో మాత్రం వంద మార్కులకు ప్రశ్నలను ఇస్తున్నారు. దీని వల్ల పూర్తిస్థాయిలో మార్కులు తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుందని నిపుణుల అభిప్రాయం.

ఫిజిక్స్‌, కెమిస్టీ, బయోలజీ కలిపి ఒకే పేపర్‌..
గత ఏడాది నిర్వహించిన పరీక్షల్లో ఫిజిక్స్‌ , కెమిస్ట్రీ కలిపి ఒక పేపర్‌, బయోలజీ మరోక పేపర్‌ కింద ఇచ్చారు. కానీ ఈ సారి ఈ మూడు విభాగాలను కలిపి ఒకే ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన వెయిటేజిని విద్యార్థులకు ఇప్పటికే వివరించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన నోటీసులో జీవశాస్త్రం నుంచి 17 ప్రశ్నలు, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి 16 ప్రశ్నలు ఇవ్వనున్నారు. విద్యార్థులు సమాధానాలు రాసేందుకు మొదట 24 పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. ఇది సరిపోకపోతే.. అదనంగా 12 పేజీల బుక్లెట్ కూడా ఇస్తారు. భౌతిక, రసాయన శాస్త్రాల జవాబులు రాసేందుకు 12 పేజీల బుక్‌లెట్‌, జీవశాస్త్రానికి మరో 12 పేజీల బుక్‌లెట్‌ ను ఇన్విజిలేటర్లు వేర్వేరుగా ఇవ్వనున్నారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను సుమారు 6,64,152 మంది రాయనున్నారు. వీరి కోసం సుమారు 3,449 కేంద్రాలను అధికారులు సిద్దం చేశారు. గత ఏడాది పరీక్ష పత్రాలు లీకైన నేపథ్యంలో ముందు నుంచే పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు నిఘా ఉంచారు. ఫోన్లను ఎవరూ కేంద్రానికి తీసుకెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. బస్‌ కండెక్టర్‌కు హాల్ టికెట్టు చూయించి.. పరీక్ష కేంద్రానికి వెళ్లవచ్చని వారు చెబుతున్నారు.