పరీక్ష పత్రాలు లీక్‌ చేస్తే ఉద్యోగిపై వేటే – సబిత వార్నింగ్‌

తెలంగాణలో వరుసగా పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ విషయమై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరుసగా రెండు రోజులు తెలుగు, హిందీ పరీక్ష పత్రాలు వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంపై ఆ రాష్ట్రంలో పెద్ద దూమారమే రేపుతోంది. దీంతో పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న సిబ్బంది, అధికారులకు విద్యాశాఖ మంత్రి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడే వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్‌ కాలేదని, ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

కలెక్టర్లు, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోవాలి..
ఇకపై జరగనున్న నాలుగు పరీక్షలకు పకడ్భందీగా నిర్వహించాలని మంత్రి సబిత.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. ఇక ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ జవాబు పత్రాల బండిల్‌ మిస్సయ్యింది. దీనిపై కూడా మంత్రి స్పందించారు. ఆయా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయాలని.. స్థానికంగా ఉండే.. జిరాక్స్‌ షాప్‌లు మూసివేయించాలని ఆదేశించారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు పోలీసులు ఉండాలని.. పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బంది, ఇన్విజిలేటర్లను వీరు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. సెల్‌ఫోన్లు వెంట తెచ్చినట్టు తేలితే అక్కడే కఠిన చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్‌ జోన్లుగా ఉండేలా చూడాలి. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లకుండా చూసే బాధ్యత చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులదే అని మంత్రి తెలిపారు. స్మార్ట్‌వాచ్‌లను సైతం తీసుకురావొద్దన్నారు. పరీక్ష టీ, ఇతర శీతల పానీయాల కోసం ఇన్విజిలేటర్లు బయటకు రావొద్దని మంత్రి ఆదేశించారు. పరీక్ష ముగిసే వరకు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.