విశ్వక్​ ఆ మాట అనేసరికి బాధేసింది: తారక్​

‘వెళ్లిపోమాకే’ సినిమాతో టాలీవుడ్​లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విశ్వక్​ సేన్​. పాగల్​, ఫలక్​నుమా దాస్​, ఈ నగరానికి ఏమైంది, హిట్​, అశోక వనంలో అర్జున కల్యాణం వంటి సినిమాలతో విశ్వక్​ తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో మాస్​ ఎంటర్​టైనర్​ దాస్ కా ధమ్కీ సినిమాతో రాబోతున్నాడు విశ్వక్​. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చ్ 22న పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతుంది. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఆస్కార్ గెలిచాక మొదటి సారి మీడియా ముందుకు ఎన్టీఆర్ రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ మాట్లాడుతూ..‘ఇప్పటికీ నాకు మనసు బాలేనప్పుడు చూసే సినిమాల్లో విశ్వక్​ నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఒకటి. యాటిట్యూడిక్​గా కనిపిస్తూనే నవ్వించే క్యారెక్టర్​లో నటించాడు. నిజానికి అలా చేయడం చాలా కష్టం. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ విశ్వక్​ ప్రతిభావంతుడే. విశ్వక్ రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేస్తున్నాడనుకున్నప్పుడు అశోక వనంలో అర్జున కల్యాణంతో వైవిధ్యం చూపించాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేను వెళ్లాల్సి ఉంది. కానీ కుదర్లేదు. ఆ చిత్రం చూశా షాక్ అయ్యా. యాటిట్యూడ్‌తో మాట్లాడే మనిషి అందుకు పూర్తి భిన్నంగా సాఫ్ట్ క్యారెక్టర్‌లో ఒదిగిపోగలడా? అని అనిపించింది. ఆ మూసధోరణిలో నుంచి బయటకొచ్చేందుకు నాకు చాలా కాలం పట్టింది. ‘అన్నా.. ఈ సినిమాకు ఉన్నదంతా పెట్టేశా.. ఈవెంట్‌కు మీరు రావాలంతే’ అని నన్ను కలిసినప్పుడు విశ్వక్ ఆ మాట అంటుంటే చాలా బాధేసింది’ అన్నారు.

ఇక, విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడిదాకా వచ్చాడు ఎన్టీఆర్ అన్న. అభిమానుల కోసం వచ్చారు. ఎన్టీఆర్ అన్న ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్టు పెట్టి కారు దాక వచ్చి ఎక్కించాడు. అప్పుడు అన్న ధమ్కీ కోసం రావాలి అంటే సరే మాట ఇచ్చాను అన్నారు. ఆ తర్వాత తారకరత్న గారు చనిపోయిన సమయంలో కూడా ఆ కార్యక్రమాలు అయ్యాక నాకు ఫోన్ చేయించి ఈవెంట్ ఎప్పుడో డేట్ కనుక్కోమన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మాట గుర్తుపెట్టుకున్నాడు అన్న. ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఎన్టీఆర్ అన్నే. ఎన్టీఆర్ అన్నని ఇప్పటిదాకా చూసింది టీజర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడే మొదలయింది. ఈ సినిమాకి మొత్తం డబ్బులు పెట్టేశాను. నేను పడిపోతే బాగుండు అని చాలా మంది కోరుకున్నారు. నేను ఏడ్వాలనుకున్నారు. కానీ పై నుంచి దేవుడు చూస్తున్నాడు. అందుకే ఇవాళ ఎన్టీఆర్ అన్నని పంపించాడు ఇక్కడికి. సినిమాకు డబ్బులు మొత్తం పెట్టాను, కష్టపడ్డాను. ఈ గ్యాప్ లో నేను తలుచుకుంటే హీరోగా మూడు సినిమాలు చేసేటోన్ని. కానీ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాను. ఇది విశ్వక్సేన్ 2.0’ అని ఎమోషనల్ గా మాట్లాడారు విశ్వక్. నివేదా పేతురాజ్​ హీరోయిన్​గా నటించిన ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషించారురు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనుంది. ఇది విశ్వక్ మొదటి పాన్ ఇండియా చిత్రం. వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. దినేష్ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఎన్టీఆర్ రాకతో దాస్ కా ధమ్కీ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.