పాల‌తో స్నానం, గులాబీల‌పై ప‌డ‌క‌: ఇవేం డిమాండ్స్ రా బాబూ..!

ప్ర‌ముఖ భోజ్‌పురి నటుడు, గోర‌ఖ్‌పూర్ ఎంపీ ర‌వి కిష‌న్ మ‌రోసారి తన గురించి ఎవ్వ‌రికీ తెలీని విష‌యాన్ని చెప్పి ఆశ్చర్యానికి గురిచేసారు. గ‌తంలో తానూ క్యాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న‌ను ఎదుర్కొన్నానంటూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసిన ర‌వి కిష‌న్.. ఇప్పుడు త‌న‌కున్న వింత అల‌వాటు కార‌ణంగా మంచి సినిమాలు వ‌దులుకున్నానని తెలిపారు. ఒక్క‌సారి స్టార్‌డం వ‌స్తే త‌ల‌పొగ‌రు ఉంటుంద‌న్న విష‌యం ఎంత నిజమో త‌నదాకా వ‌స్తే కానీ తెలీలేద‌న్నారు. అప్ప‌టికే ప‌లు హిందీ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న ర‌వి కిష‌న్‌కు.. బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న గ్యాంగ్స్ ఆఫ్ వ‌సేపూర్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. ఈ సినిమాలో ర‌వి కిష‌న్‌కు ఛాన్స్ ఇస్తే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఆయ‌న్ను సంప్ర‌దించార‌ట‌. అయితే ఈ సినిమాలో తాను న‌టించాలంటే పారితోషికంతో పాటు ఓ కండీష‌న్‌కు కూడా ఒప్పుకోవాల‌ని ర‌వి కిష‌న్ చెప్పార‌ట‌. అదేంటంటే.. తాను షూటింగ్ చేస్తున్న‌న్ని రోజులు స్నానం చేయ‌డానికి 25 లీట‌ర్ల పాలు, ప‌డుకోవ‌డానికి గులాబీ పూలు తెప్పించాల‌ని అడిగార‌ట‌. అది విన్న అనురాగ్ క‌శ్య‌ప్ షాక‌య్యారు. ఇలాంటి వారిని సినిమాలో తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని ర‌వి కిష‌న్‌కు వ‌ద్ద‌నుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ర‌వి కిష‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డిస్తూ త‌న పిచ్చి కండీష‌న్ల వ‌ల్ల మంచి సినిమాలో న‌టించే అవ‌కాశం కోల్పోయానని బాధ‌ప‌డ్డారు.

“ఒక‌సారి స్టార్‌డం వ‌స్తే త‌లకెక్కుతుంది. నాకూ అలాగే జ‌రిగింది. స్టార్‌డం అంటే మంచి నీళ్ల‌తో కాకుండా పాల‌తో స్నానం చేయ‌డం, గులాబీ రెక్క‌ల‌ను మంచంపై వేసుకుని ప‌డుకోవ‌డం అనుకున్నాను. స్టార్ అంటే అలాగే జీవించాల‌ని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే గ్యాంగ్స్ ఆఫ్ వ‌సేపూర్‌లో ఛాన్స్ పోయిందో అప్పుడే నాకు తెలిసొచ్చింది ఈ అల‌వాట్ల నుంచి బ‌య‌ట‌ప‌డాలని” అని వెల్ల‌డించారు రేసుగుర్రం విల‌న్.