‘నాకు సంస్కారం ఉంది కాబట్టి అలా మాట్లాడలేను’ తమ్మారెడ్డి కౌంటర్​!

ఎస్​.ఎస్​. రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమా ఆర్​ఆర్​ఆర్​. భారతదేశం తరపున అఫీషియల్​గా ఆస్కార్​కు ఎంపిక కాకపోయినా నేరుగా బరిలోకి దిగిన సంగతి తెలసిందే. అయితే ఈ సినిమా ఆస్కార్​ ఎంట్రీ కోసం రాజమౌళి చేసిన ఖర్చు గురించి ఇటీవల టాలీవుడ్​ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్​ అయ్యాయి. దీనిపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఘాటుగా స్పందించారు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే రాఘవేంద్రరావు సీరియస్‌గా ట్వీట్ చేశారు. మెగాబ్రదర్​ నాగబాబు కూడా పరుష పదజాలంతో కామెంట్​ చేశారు. అయితే దీనిపై తాజాగా భరద్వాజ సోషల్​ మీడియా ద్వారా స్పందించి తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్​ ఇచ్చారు.

తనపై వచ్చిన కామెంట్స్‌ పై తమ్మారెడ్డి భరద్వాజ రిప్లై ఇచ్చారు. విద్యార్థులతో తాను మాట్లాడిన వాటిని కొంతమంది అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నారని, తాను కూడా అంతే ఘాటుగా స్పందించి, సమాధానం చెప్పగలనని పేర్కొన్నారు. అయితే, తల్లిదండ్రులు తనను సంస్కారంతో పెంచారని, అందుకే వాళ్లలా మాట్లాడలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. వారం రోజుల క్రితం రాజమౌళిని పొగుడుతూ ట్వీట్ చేస్తే ఎవరూ స్పందించలేదుగానీ,  రెండు గంటల ప్రసంగంలో ఒక్క నిమిషం ఉన్న వీడియోని తీసుకుని వివాదాస్పదం చేశారని, ఈ వివాదాన్ని కొనసాగించాలని అనుకోవడం లేదని అన్నారు.

కాగా, ‘ఇటీవల జరిగిన ఒక సెమినార్‌‌లో విద్యార్థులతో సినిమాల గురించి చాలా విషయాలు మాట్లాడాను. ఆ సందర్భంలోనే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా గురించిన ప్రస్తావన వచ్చింది. ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుందా అని విద్యార్థులు అడిగారు. ఆ సినిమాకు చాలా డబ్బు ఖర్చు అయ్యి ఉంటుంది. ఇప్పుడు అవార్డు కోసం ప్రయత్నిస్తున్నారు. అవార్డు కోసం తీసే సినిమాలకు అంత ఖర్చు చేయలేం. కాబట్టి ప్రయత్నించవచ్చని చెప్పా. కానీ దానిని అర్థం చేసుకోకుండా కొందరు నీ దగ్గర లెక్కలు ఉన్నాయా అని అడుగుతున్నారు. మరొకరు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. నేను నోరు తెరిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. కానీ నాకకు సంస్కారం ఉంది కాబట్టి అలా చేయలేను’ అంటూ తన మాటలపై వివరణ ఇస్తూనే తనపై వచ్చే కామెంట్లకు కౌంటర్​ ఇచ్చారు భరద్వాజ.

‘రాజమౌళి ఆస్కార్​ కోసం దాదాపు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ డబ్బుతో మేం పది సినిమాలు తీసి ముఖాన కొడతాం’ అంటూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘మిత్రుడు భరద్వాజ్ కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచవేదికలపై మొదటిసారి వస్తున్న పేరు చూసి గర్వపడాలి. అంతే కానీ రూ. 80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?’ అని కౌంటర్ వేశారు. ఈ విషయంలో చాలామంది రాఘవేంద్రరావుకి సపోర్ట్ చేస్తున్నారు. మెగా బ్రదర్​ నాగబాబు కూడా ఘాటుగా స్పందించడంతో తమ్మారెడ్డి దీనిపై వివరణ ఇచ్చారు.