నాకు నచ్చినట్టు ఉంటా.. అది నా ఇష్టం!
సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా వీరసింహా రెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన మెరిసిన నటి హనీ రోజ్. ఈ సినిమా తర్వాత హనీ రోజ్ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్లో పలు అవకాశాలు కూడా అందకుంటోంది ఈ సీనియర్ హీరోయిన్. ఒక్క సినిమాతో తెలుగులో కూడా హనీరోజ్‌కి అభిమానులు ఏర్పడ్డారు. నిజానికి హనీ రోజ్కి తెలుగులో వీరసింహా రెడ్డి మొదటి సినిమా కాదు. కెరీర్ మొదట్లోనే హనీరోజ్ తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మలయాళంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క ప్రత్యేక పాత్రల్లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది హనీరోజ్. మలయాళంలోనే కాదు ఇప్పుడు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హనీరోజ్. ఒక్క సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈ మలయాళీ భామ తాజాగా బాడీ షేమింగ్, డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
వీరసింహరెడ్డి సినిమాతో హనీరోజ్‌కి టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు ప్రేక్షకులూ హనీరోజ్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రారంభోత్సవాలు, కార్యక్రమాలకూ అతిథిగా హాజరవుతోంది. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న హనీరోజ్ బాడీ షేమింగ్స్, హీరోయిన్స్ డ్రెస్సింగ్స్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ సందర్భంగా హనీ రోజ్ మాట్లాడుతూ.. ‘సినిమాల్లో నా పాత్రకు తగ్గట్టు నా డ్రెస్సింగ్ ఉంటుంది. నాకు నచ్చినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు కనపడతాను. ఇక బయట కూడా నాకు నచ్చిన, నాకు కంఫర్ట్ గా ఉండే బట్టలే వేసుకుంటాను. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నటీనటుల పర్సనల్ ఛాయిస్. మా బట్టల మీద ఎందుకు ట్రోల్ చేస్తారు. మేము కాస్త బరువు పెరిగినా ట్రోల్ చేస్తారు. బాడీ షేమింగ్ చేస్తారు. నన్నయితే ఒకప్పుడు దారుణంగా బాడీ షేమింగ్ చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. కొంతమంది చేసే నెగిటివ్ కామెంట్స్ మాకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది’ అంటూ తన అనుభవాలు పంచుకుంది. ఇక, ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు కుండ బద్ధలుకొట్టినట్టు చెప్పిందటూ మెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇదేం పోయే కాలం అంటూ కామెంట్ చేస్తున్నారు.