ఏపీ ఉద్యోగుల సంఘానికి హైకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఉద్యోగుల సంఘానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా వార్ నడుస్తోంది. ఇటీవల కాలంలో ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులు తమకు ఒకటో తేదీనే జీతాలు పడట్లేదని, ఇతర కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించట్లేదని ఆ సంఘం నాయకులు సూర్యనారాయణ గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇక అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ఆ సంఘంపై ఆగ్రహించిన ప్రభుత్వం ఇటీవల ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగులతో మాత్రమే చర్చలు జరిపింది. ఏపీ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. ఈనేపథ్యంలో మరోసారి సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు సమావేశాలకు ఆహ్వానించట్లేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై ఇవాళ విచారించిన హైకోర్టు ఏపీ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఇకపై ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు తప్పనిసరిగా పిలవాలని ఆదేశించింది.
ఇంకా హైకోర్టు ఏమందంటే..
ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. దీనిపై ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం తమను ఆహ్వానించడం లేదని, పిలిచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సూర్యనారాయణ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ఉద్యోగుల సంఘంపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం..
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ను కలిసినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. అయితే.. ఈ సంఘాన్ని రద్దు చేస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వ పెద్దలు కొంత మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి గవర్నర్ను ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కలిశారని.. ఈ సంఘాన్ని రద్దు చేయాలని కోరారు. అయితే దీనిపై వివరణ ఇచ్చిన సూర్యనారాయణ.. తాము నిబంధనలకు లోబడే ఏపనైనా చేశామని చెప్పారు. ఈక్రమంలో ఈ అంశంపై సూర్యనారాయణ కోర్టుకు వెళ్లి స్టే కూడా తెచ్చుకున్నారు.