చిరంజీవికి హైకోర్టు నోటీసులు
సినీ నటుడు చిరంజీవికి.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని వివాదాస్పద స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. ప్రజల అవసరాల కోసం కేటాయించిన దాదాపు 595 గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ చిరంజీవికి అమ్మినట్లు జె.శ్రీకాంత్ బాబు, తదితరులు కొన్నిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ పిటీషన్‌ను పరిశీలించిన హైకోర్టు మంగళవారం తీర్పు వెల్లడిస్తూ.. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చిరంజీవికి మధ్యంతర నోటీసులు జారీ చేసింది. ఆ గజాలను జీహెచ్ ఎంసీ స్వాధీనం చేసుకోకపోవడంతో నిబంధనలను అతిక్రమిస్తూ విక్రయించారని, ఆ స్థలాల్లో చిరంజీవి నిర్మాణాలు చేపట్టారని పిటీషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి, జీహెచ్ ఎంసీకి సమన్లు జారీ చేసింది. ఈ కేసును ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.