‘హలో మీరా’.. సినిమాలో కనిపించేది ఒక్కరే!
ఒక సినిమాలో రకరకాల పాత్రలు, విభిన్న కారెక్టర్లుంటాయి. హీరో, హీరోయిన్, వాళ్ల కుటుంబాలు, స్నేహితులు, విలన్, కమెడియన్స్.. ఇలా అన్ని ఎమోషన్స్‌ని చూపించేందుకు చాలా పాత్రల్ని సృష్టిస్తారు రచయితలు. నిజానికి అలా ఉంటేనే ప్రేక్షకులూ సినిమాను తమకు అన్వయించుకుని ప్రతి ఫ్రేమ్‌ని ఎంజాయ్ చేస్తారు. కానీ పరిమితమైన పాత్రలతోనూ అద్భుతాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు కొందరు డైరెక్టర్లు. ఈ విషయం ఇది వరకు ఎన్నో సార్లు నిరూపితమైంది. ఇప్పుడు తెలుగులో మరో ప్రయత్నంగా గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో ‘హలో మీరా’ అనే సినిమా రాబోతోంది. ఒకే ఒక పాత్రతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ తరహా సినిమా తీయడం అంటే సాహసమనే చెప్పాలి.
ఆ సాహసాన్ని ‘హలో మీరా’ అంటూ ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకుడు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవంతో ‘హలో మీరా’ను తీశారు. ఈ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు కాకర్ల. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ‘హలో మీరా’ సినిమాను నిర్మించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు సోషల్ మీడియాలో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. హలో మీరా సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తెరకెక్కించడం, సినిమా మొత్తంలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా చిత్రీకరించడంపై సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా U సర్టిఫికెట్ పొందడం మరింత ఆసక్తిని కలిగించే విషయం. హలో మీరా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు ఎస్.చిన్న సంగీతం అందించగా హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. సరికొత్త ఆలోచనతో రానున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితం పొందుతుందో చూడాలి మరి!