తెలుగు రాష్ట్రాలకు వాన కబురు.. ఏ జిల్లాల్లో అధికమంటే!
ఒకవైపు ఎండలు మండిపోతోన్న వేళ… వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. గురువారం నుంచి వరుసనగా నాలుగైదు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏ జిల్లాలపై ప్రభావం ఉంటుందంటే..
వాతావరణశాఖ.. 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతోపాటు ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈక్రమంలో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ చెప్పడం ప్రజలకు కొంత ఊరట కలిగిస్తుందనే చెప్పాలి. అయితే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో పరిస్థితి ఇదీ…
రానున్న అయిదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మెస్తరు వానలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని బుధవారం వెల్లడించింది. గురువారం నుంచి నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాల్లో కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.