తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన.. పిడుగులూ పడొచ్చు!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి.. వర్షం కురిసే అవకాశం ఉందంటూ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది.
ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో శుక్రవారం నుంచి శనివారం వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలుచోట్ల వడగళ్లు కురుస్తాయని చెప్పింది. అలాగే ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో శక్తివంతమైన క్యుములోనింబర్ మేఘాలు ఏర్పడ్డాయని.. రానున్న రెండు గంటల్లో పిడుగులు హైదరాబాద్ శివారుల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపలతో వర్షం కురుస్తుందని వివరించింది. ఏప్రిల్ 10 తర్వాత రాష్ట్రంలో పొడివాతారణం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
రైతులు అప్రమత్తం కావాలి..
అకాల వర్షాలతో తెలంగాణ రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు వర్షం వస్తుందో,, ఈదురు గాలులతో పంట ఎక్కడ నష్టపోతామో అన్న ఆందోళనలు వారిలో నెలకొన్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలు, వడగండ్ల వానలకు అనేక మంది రైతుల పంట దెబ్బతింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం మామిడి, మిర్చి, వరి, అరటి వంటి పంటలు సాగులో ఉన్నాయి. రానున్న మరో మూడు రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుండటంతో రైతన్నల్లో ఆందోళనలు నెలకొన్నాయి.