ఆరుగాలం కష్టం వర్షార్పణం.. పాపం రైతన్న!

అల్పపీడన ద్రోనీ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు రానున్న మూడు నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక నిన్న, ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి రైతుల తీవ్రంగా నష్ట పోయారు.

పంట నష్టంపై అంచనా వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం..
తెలంగాణలో పంట నష్టంపై అంచనా వేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అకాలవర్షం, వడగళ్ల వానతో వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలోని 13 గ్రామాలలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. అయితే, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించనున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలో వడగళ్ల వాన వల్ల మామిడి, గులాబీ, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యానపంటలు, కొంతమేర మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

మంచు ప్రాంతంలా పంట పొలాలు..
వడగళ్ల వానలు వల్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల పొట్టదశకు వచ్చిన వరి నేలవాలింది. మామిడి పిందెలు, కాయలు రాలి తీవ్ర నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలతో ప్రధానంగా ఆరు జిల్లాల్లో పంటలపై ప్రభావం పడింది. సుమారు 50 మండలాల్లోని 650 గ్రామాల్లో నష్టం జరిగిందని.. ముఖ్యంగా వికారాబాద్‌ జిల్లాలో నష్టం తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్, మర్పల్లి మండలాల్లో అయితే పంట పొలాలన్నీ వడగళ్లతో నిండిపోయి మంచు ప్రాంతంలా మారిపోయాయి. ఆ పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీంతోపాటు సంగారెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ పలుచోట్ల వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయి.

ఆంధ్రాలో ఇదే పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామలో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న విత్తనాలు తడిసిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మిర్చి పంట దెబ్బతింది. కళ్లాల్లో ఆరబోసిన మిరపకాయలు పూర్తిగా తడిచిపోవడంతో పంట చేతికి వచ్చిన సమయంలో భారీ వర్షానికి తీవ్ర నష్టపోయామని రైతులు భావోద్వేగానికి గురవుతున్నారు. మిర్చి ధర బాగా ఉన్న సమయంలో భారీ వర్షంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కనీసం ఈ ఏడాది అయినా లాభాలు వస్తాయని భావించిన రైతులకు ఈ వర్షాలు కొంతవరకు కన్నీళ్లను మిగిల్చాయని చెప్పవచ్చు.

 

వర్షాల వేల ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఏపీ, తెలంగాణల్లో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాల వేల జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ వైర్లు. కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని… విద్యుత్తు వైర్ల దగ్గర తీగలపై బట్టలు వేయవద్దని సూచిస్తున్నారు. రైతులు బావులు వద్ద సమస్య ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలి. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. చెట్ల కింద ఎవ్వరూ ఉండవద్దని.. లోతట్టు ప్రాంతాల వారు అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు. చిన్న పిల్లలు. వృద్దులు, చలిగాలులు. వర్షాలకు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉన్నందున.. బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వర్షం పడి రోడ్లు జారే అవకాశం ఉన్నందును వాహన చోదకులు నీరు ఉన్న చోట నెమ్మదిగా వెళ్లాలని చెబుతున్నారు.