ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లోనే ఉద్యోగి హఠాణ్మరణం

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ ఉద్యోగి హఠాణ్మరణం చెందారు. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులో జరిగింది. కావలికి విద్యుత్తు శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సయ్యద్ ఖాజా మొహిద్దీన్ (55) ఆదివారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చారు. నగరంలోని డీకే మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రానికి వచ్చిన క్రమంలో ఒక్కసారిగా మొహిద్దీన్‌ అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే స్పందించి అక్కడి సిబ్బంది 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లే సరికి ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఖాజా మొహిద్దీన్ మృతి చెందారు.

ఉదయం నుంచే నలతగా ఉన్నా..
నెల్లూరు బాలాజీ నగర్లోని మల్లెల సంజీవయ్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఆయన ఓపీవోగా ఉన్నారు. అప్పటి వరకు అందరితో కలివిడిగా మాట్లాడుతున్న ఆయన ఒక్కసారిగా తనకు గుండెల్లో నొప్పి అంటూ కుప్పకూలారు. దీంతో చుట్టుపక్కల ఉద్యోగులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఉదయం విధులకు హాజరైన కొంత సేపటికే తనకు ఆరోగ్యం బాగాలేదని గుండెల్లో నొప్పి వస్తోందని మొహిద్దీన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. అయితే పట్టించుకోలేదు. వారు సకాలంలో స్పందించలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో మొహిద్దీన్‌ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారని తోటి ఉద్యోగులు తెలిపారు.