H3N2 కేసులు తగ్గుముఖం – ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
దేశంలో హెచ్3ఎన్2 కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశంలో 451 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ నెలాఖరు నుండి కేసులు తగ్గుముఖం పడతాయని తెలిపింది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. H3N2 అనేది మానవేతర ఇన్‌ఫ్లుయంజా వైరస్ అని.. ఇది సాధారణంగా పందులలో వ్యాపిస్తుందని వివరించారు. వాటి నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉందన్నారు. ఈ లక్షణాలు కాలానుగుణ ఫ్లూ వైరస్‌లా ఉంటాయని.. జ్వరం, దగ్గు, ముక్కు కారటం ఇతర శ్వాసకోశ లక్షణాలు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం వంటి ఇతర లక్షణాలు ఉండవచ్చని పేర్కొంది.
ఆందోళన అవసర్లేదు.. జాగ్రత్లు పాటిస్తే చాలు..
ఇక హెచ్3ఎన్2 వైరస్.. కొవిడ్‌గా మారుతుందా అన్న ఆందోళనలు దేశంలో పెరిగాయి. పల్మనాజిస్టుల ప్రకారం.. కొవిడ్‌కి ఈ కొత్తరకం ఫ్లూ వైరస్‌కు చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 5 శాతం కంటే తక్కువే ఉందని చెబుతున్నారు. కోవిడ్ సమయంలో తీసుకున్న జాగ్రత్తల మాదిరిగానే మాస్కులు ధరిస్తే దీన్ని కట్టడి చేయవచ్చని చెబుతున్నారు. ఇది సాధారణ కాలానుగుణ శ్వాసకోశ వైరస్‌లు భావించాలని.. గత రెండేళ్ల కరోనా కారణంగా ప్రజలు మాస్కులు ధరించడం వల్ల ఈ ఫ్లూ వంటి వైరస్‌లను నిరోధించగలిగామని కొందరు వైద్యులు చెబుతున్నారు.
కేసులపై ఎప్పటికప్పుడు సమీక్ష..
కర్ణాటకలో హెచ్3ఎన్2 కారణంగా ఈ నెల 1న మరణించిన వ్యక్తిని హీరె గౌడ(82)గా అధికారులు గుర్తించారు. అయితే అతనికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక హెచ్3ఎన్2 మరణాన్ని అధికారులు ధ్రువీకరించగా.. పంజాబ్, హర్యానాల్లో కూడా మరణాలు నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మరణాల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఇన్‌ఫ్లూయంజా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా 440 కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. దీంతో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3,294కు చేరిందన్నారు.