గుణశేఖర్ డైరెక్షన్లో మరో మైథలాజికల్ సినిమా!
టాలీవుడ్లో ఒక్కో దర్శకుడిదీ ఒక్కో స్టైల్. పూరీ జగన్నాథ్ మాస్‌కి పెట్టింది పేరైతే, వి.వి.వినాయక్ యాక్షన్‌కి మారుపేరు. ఇక, కృష్ణవంశీ, శ్రీను వైట్ల, కొరటాల శివ, బోయపాటి శ్రీనివాస్, వంశీ పైడిపల్లి.. వీళ్లంతా అటు ఫ్యామిలీతోపాటు ఇటు యాక్షన్నీ జోడించి ప్రేక్షకులను మెప్పిస్తారు. దర్శకధీరుడు రాజమౌళి అద్భుతమైన విజువల్స్‌ని జోడించి మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సుకుమార్ క్లాస్‌గా మాస్‌ని ఎలివేట్ చేయడంలో దిట్టలుగా పేరు తెచ్చుకున్నారు. అనిల్ రావిపూడి, మారుతి కామెడీతో మెప్పించే దర్శకులు.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో పంథాని ఫాలో అవుతూ తెలుగుతోపాటు ఇతర భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటూ పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్నారు. కాగా, ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్‌ది ప్రత్యేక స్టైల్. ఆయన దృష్టి, ఆలోచన అంతా పౌరాణికాలు, చరిత్ర, బంధాలు, బంధుత్వాలు, సంస్కృతి, సంప్రదాయాల మీదనే ఉంటుంది. అదే ఆయన సినిమాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
చిన్న పిల్లలతో రామాయణం వంటి ఇతిహాసాన్ని తెరకెక్కించాలన్నా.. రుద్రమదేవి లాంటి చారిత్రక సినిమా తీయాలన్నా గుణశేఖర్‌కే చెల్లింది. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా శాకుంతలం. సమంత, దేవ్ మోహన్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలకానుంది.
ఈ సినిమా తర్వాత గుణశేఖర్ నెక్ట్ ప్రాజెక్ట్ ఏమిటనే దానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాకుంతలం సినిమా తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ను మళ్లీ పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది. ‘హిరణ్య కశ్యప’ అనే టైటిల్‌తో మరో పౌరాణిక సినిమా తీయడానికి ప్లాన్ చేశారు గుణ. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే మూడేళ్లు పని చేశారు కూడా. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, స్క్రిప్ట్ వర్క్ పై చాలా కాలం పని చేసిన తర్వాత టైటిల్ రోల్ కోసం రానాని సెలక్ట్ చేశారు. రానా కూడా ఆ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈలోపే కరోనా కారణంగా పరిస్ధితులు మారిపోయాయి. మరోవైపు రానా కూడా కొద్దిగా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ప్రాజెక్ట్ కొద్ది రోజులు పక్కకు పెట్టాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దాంతో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో సమంత ముఖ్య పాత్రలో శాకుంతలం సినిమా తెరకెక్కించారు గుణశేఖర్. అలా శాకుంతలం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. శాకుంతలం రిలీజ్ తర్వాత ‘హిరణ్య కశ్యప’ను పూర్తి చేయాలనుకుంటున్నారట గుణశేఖర్. అయితే టైటిల్ రోల్‌ను రానా చెయ్యడం లేదని, మరొకరిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమానే గుణశేఖర్ స్వయంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే తెలుగు ప్రేక్షకులకు గుణ శేఖర్ డైరెక్షన్లో మరో మైథలాజికల్ మూవీని చూసే అదృష్టం దక్కుతుందన్నమాట.