ఘనంగా మంచు మనోజ్- మౌనికల పెళ్లి.. హాజరైన సినీ ప్రముఖులు!
మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. ఫిలిం నగర్‌లోని మోహన్ బాబు ఇంట్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు తెలుగు సిని పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతోపాటు ఇరు కుటుంబాల బంధుమిత్రులు హాజరైనట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన విషయాలు జనాల్లో డిస్కషన్ పాయింట్ అయిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడంపై బోలెడన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు వారింట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. మంచు మనోజ్ రెండో పెళ్లికి సంబంధించి పూర్తి బాధ్యతలు మంచు లక్ష్మి తీసుకుంటున్నట్లు టాక్. అయితే ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయినట్లు సమాచారం. మంచు లక్ష్మీ మెహందీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేయగా.. మనోజ్ తనకు కాబోయే భార్య అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తాజాగా మంచు లక్ష్మి ట్విటర్ వేదికగా మనోజ్‌ని పెళ్లి కొడుకుని చేసిన ఫొటో పంచుకోవడంతో అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
మనోజ్ పెళ్లి వేడుకలను మహా మంత్ర పూజతో ప్రారంభించారని తెలుస్తోంది. ఇలా మంచు మనోజ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుండటంతో ఆయన సన్నిహిత వర్గాలు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్.. రెండో పెళ్లికి రెడీ అయ్యారు. భూమా మౌనిక రెడ్డితో ఎప్పటినుంచో క్లోజ్ గా ఉంటున్న మనోజ్.. ఇప్పుడు ఆమెనే పెళ్లాడారు. చాలా కాలంగా మౌనికా రెడ్డి ప్రేమలో మంచు మనోజ్ ఉన్నారని టాక్. గతంలో మౌనిక రెడ్డి మొదటి వివాహానికి కూడా మంచు మనోజ్ హాజరయ్యారనే ప్రచారం జరిగింది. అయితే అటు మనోజ్, ఇటు మౌనిక రెడ్డి వైవాహిక జీవితాలు సాఫీ సాగకపోవడంతో డివోర్స్ తీసుకున్నారు. వివాహ బంధంతో ఏకమైన మంచు మనోజ్, మౌనిక జంటకు సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.