ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌!

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 31లోగా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం ప్రకటించింది. ఈ సందర్బంగా కేబినెట్‌ సబ్‌ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాలు మాత్రం తమ డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందేనని కేబినెట్ సబ్ కమిటీకి అల్టిమేటమ్ జారీ చేశాయి. లేదంటే తాము పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశాయి.

మూడు వేల కోట్లు చెల్లించేందుకు అంగీకారం..
ఉద్యోగ సంఘాలతో సమావేశం ముగిసిన అనంతరం.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.3 వేల కోట్ల మేర ఈ నెల 31లోపు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. మరో మూడు నుంచి ఆరు నెలల్లో మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తామని ఆయన వివరించారు. కరోనా కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటోందని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమని.. చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సంతృప్తిపడేలా చర్చలు సాగాయన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌.. పెండింగ్‌లో ఉన్న 3 వేల కోట్లు రూపాయలు చెల్లిస్తామన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ, ఉద్యోగులకు చెందిన పెండింగ్ క్లెయిమ్స్ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తాం. ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 లోపల చెల్లిస్తాం. అందరి ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు చేస్తాం. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, మెడికల్ ఎరియర్స్ అన్నీ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తామని ఆయన పేర్కొన్నారు..

మార్చి 9వ తేదీ నుంచి ఉద్యమం యథావిధిగా..
మంత్రివర్గంతో చర్చల్లో పురోగతి ఉందంటూనే మార్చి 9న జరిగే ఉద్యమం యధావిధిగా కొనసాగుతుందని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అదేవిధంగా మంత్రి వర్గ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీంతోపాటు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఆయన అడగగా.. మంత్రి బొత్స కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బొప్పరాజు పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి సీఎస్‌తో సమావేశానికి రావాలని ఏసీ జేఏసీ అమరావతి సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించింది. మరి ఈ సమావేశంలో ప్రభుత్వం ఏ మేరకు ఉద్యోగులకు హామీ ఇస్తుందో వేచి చూడాలి.

లిఖిత పూర్వకంగా ఇస్తే ఉద్యమ కొనసాగింపుపై పునరాలోచన… 

బొప్పరాజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ”మిగిలిన పీఆర్సీ బకాయిలు, కొత్త డీఏలు తదితర అంశాలపై స్పష్టత రావాల్సిన తరుణంలో మళ్లీ సీఎస్‌ ఆధ్వర్యంలో ఈనెల 16న జరిగే సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నారు. వాటన్నింటినీ లిఖితపూర్వకంగా మినిట్స్‌ రూపంలో ఇవ్వాలని మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో మంత్రుల కమిటీ, సీఎస్‌కు తెలియజేశాం. ఒకవేళ సాయంత్రంలోపు మినిట్స్‌ ఇవ్వకపోతే యథావిధిగా ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తాం” అని వెల్లడించారు. రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో తమకు సంబంధం లేదన్న బొప్పరాజు.. తమ అజెండా నుంచి పక్కకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.