500కే గ్యాస్: మేనిఫెస్టో ప్రకటించిన రేవంత్ రెడ్డి!
ఒకవైపు తెలంగాణలో సమ్మర్ సీజన్ కారణంగా ఎండలు కాకరేపుతుండగా.. మరోవైపు రాజకీయాలు కూడా అంతకంతకూ వేడెక్కుతున్నాయి. అధికార బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఇవాళ మంత్రి వర్గ సమావేశం, రేపు క్షేత్ర స్థాయి నుంచి జిల్లా నాయకులతో భేటీ అయ్యి.. పలు రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. ఇక బీజేపీ పార్టీ నాయకులు… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్పందించాలని.. విచారణను దమ్ముధైర్యంతో ఎదుర్కోవాలని సవాలు విసురుతున్నారు. మరో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని.. అధికారంలోకి వస్తే ఏమేమి పనులు చేస్తామో చెబుతూ.. ప్రజల ముంగిటకు వారి మేనిఫెస్టోని తీసుకెళ్తున్నారు. ఇక అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రవైన ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర గురువారం కరీంనగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగా ఏర్పాటు చేసి రేవంత్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రసంగించారు.
500 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తం..
కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తాము ఏమేమి కార్యక్రమాలు చేపడతామో టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని, పేద రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల వరకు వైద్య ఖర్చులు, సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని తెలిపారు. ఇన్ని మంచి పనులు చేయాలంటే తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇయ్యాల తెలంగాణను సాధించుకున్నాం అంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ.. సోనియా గాంధీ అని స్పష్టం చేశారు. కానీ ఇవాళ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేయలేదా అని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, వినోద్, బండి సంజయ్ ఎంపీలైనా, కరీంనగర్‌కు ఒక్క రూపాయి కూడా లాభం చేకూర్చలేదన్నారు. కానీ, ఇక్కడి నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పేరు నిలబెట్టారని చెప్పారు. జైపాల్ రెడ్డి చొరవతో ఆనాడు తెలంగాణ ఏర్పడిందన్నారు. తల్లిని చంపి పిల్లను బతికించారని ప్రధాని మోదీ అవహేళన చేశారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వ్యతిరేకించిన బీజేపీ నాయకులకు ఇక్కడ మాట్లాడే హక్కు లేదన్నారు. కేసీఆర్‌పై కోపంతో బీజేపీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఇతర కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే..
కరీంనగర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ బఘేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్‌తోపాటు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్రంలోని ఇతర ప్రధాన నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే.. బీఆర్‌ఎస్, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చూస్తుంటే రాహుల్ గాంధీలా కనిపిస్తున్నారని ఆయన పోరాట పటినను చూస్తున్నట్లు ఉందన్నారు. బీజేపీ అదానీ, అంబానీ వంటి నలుగురు బడా వ్యాపారులకు దోచిపెట్టడమే అభివృద్దిగా భావిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కూడా గుజరాత్ మాదిరిగానే నలుగురున్న కుటుంబానికే లాభం జరిగిందన్నారు. ఒకే కుటుంబానికి ఉపాధి దొరికుతుందన్నారు. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రే మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాలను ముందుకు తీసుకెళ్లేందుకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే ఉన్నాయని ఆరోపించారు. ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కో హఠావ్.. తెలంగాణకో బచావో.. అని పిలుపునిచ్చారు. తానీషా, నిజాం నిరంకుశ పాలన గురించి చరిత్ర పుస్తకాల్లో చదివామని, కేసీఆర్ ఎనిమిదో నిజాంలా వ్యవహరిస్తున్నాడని ఆయన విమర్శించారు. మరోవైపు తెలంగాణ వచ్చింది కానీ నిధులు మాయమైపోయాయని, ఎక్కడా ప్రాజెక్టులు రాలేదని, ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ ఏర్పడలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.