GIS మీట్‌: పెట్టుబడులకు వేదిక.. సంస్కృతీ, సంప్రదాయాల వేడుక


గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో విశాఖ వేదికగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సును మార్చి 3, 4 తేదేల్లో నిర్వహించనుండగా.. సుమారు 25 దేశాల నుంచి, మన దేశంలోని వివిధ పరిశ్రమల నుంచీ దాదాపు 19 వేల మందికి పైగా ప్రతినిధుల రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రధానంగా 13 రంగాలపై దృష్టి సారించింది. అంతేకాదు ఈ సమ్మిట్‌కు అనేక విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి.. మరి అవేంటో చూద్దామా..

ఆహుతులను ఆకర్షించేలా పక్కా ప్లాన్‌..
విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కాకుండా… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, కలలు ఉట్టిపడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సదస్సు కేవలం మాటలకే పరిమితం కాకుండా.. కూచిపూడి, జానపద నృత్యాలతోపాటు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ తుషార్ కలియాతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు జానపద కళలైన ధింసా, తప్పెటగళ్లు, గరగలు, ఉరుములు, కొమ్ము నృత్యం వంటి కార్యక్రమాలను ప్రదర్శించి అతిథులను ఆకట్టుకోవాలని ప్లాన్‌ వేశారు. జిల్లాకు ఒక ప్రాజెక్టు చొప్పున ‘వన్ డిస్ట్రిక్.. వన్ ప్రొడక్ట్‌’ కింద రాష్ట్రంలోని హస్తకళలు, వివిధ ఉత్పత్తులను ప్రదర్శనగా ఉంచి.. తద్వారా వాటికి ప్రచారం కల్పించేలా ప్రత్యేకంగా స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా.. సీఎం సూచనల మేరకు.. తోలుబొమ్మల తయారీలో ఉపయోగించే ఉత్పత్తులతో కూడిన బ్యాడ్జీలు రూపొందించారు. వాటి వెనుక భాగంలో కలంకారీ డిజైన్లను ముద్రించారు. గెస్టులకు ఇచ్చే నోట్‌ బుక్కులపై కూడా కలంకారీ డిజైన్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పెన్నులపై కూడా రాష్ట్ర పక్షి చిలుక లోగోతోపాటు అడ్వాంటేజ్‌ ఏపీ అని ముద్రించారు. దాదాపు ఎక్కువ ఉత్పత్తులను కలంకారీ, ఇతర చేతి వృత్తులతో డిజైన్‌ చేయడంతో ఆహుతులను ఎంతగానో అవి ఆకట్టుకుంటాయని నిర్వాహకులు భావిస్తున్నారు.

కార్యక్రమాల వేళలు ఇలా..

గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో తొలి రోజు అంటే మార్చి 3వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యన భోజన విరామ సమయం ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రెండో రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. ఆహుతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.