తిరుమలలో గంజాయి కలకలం.. ఓ ఉద్యోగి ఏం చేశాడంటే?
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన సెబ్ అధికారులు తిరుమలకు గంజాయి తరలిస్తున్న టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ వ్యక్తి గంజాయి తీసుకెళ్లి ఎవరికి విక్రయిస్తున్నాడు, ఎప్పటి నుంచి ఈ దందా సాగుతోంది. ఇంకా ఎవరైనా ఉద్యోగులు దీనిలో భాగస్వాములు అయ్యారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
తిరుపతికి చెందిన గంగాద్రి అనే వ్యక్తి.. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని లగేజీ కౌంటర్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి సప్తగిరి చెకింప్ పాయింట్ వద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో సెబ్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని.. బ్యాగ్‌ను చెక్ చేయగా అతని వద్ద 15 ప్యాకెట్లలో నింపిన 150 గ్రాముల గంజాయి పట్టుబడింది. వెంటనే నిందితుడిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. నిందితుడు గంజాయిని ప్లాస్టిక్ కవర్‌లో చిన్న ప్యాకెట్లుగా ఉంచి, వాటిని కాలికి కట్టుకుని తిరుమలకు వచ్చినట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలను రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.