ఏపీ రాజధాని మార్పుపై మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ హాట్ కామెంట్స్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రెండు వేల రూపాయల నోట్ల రద్దు.. తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానుల అంశం గత నాలుగేళ్లుగా కొలిక్కిరాలేదు. ఈ తరుణంలో ఇటీవల ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, కొందరు మంత్రులు త్వరలో పరిపాలనా రాజధాని విశాఖ కేంద్రంగా ఏర్పాటు అవుతుందని ప్రకటించడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో అమరావతి రైతులకు మద్దతుగా ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజధాని వివాదం కోర్టు పరిధిలో ఉండగా.. వైసీపీ ప్రభుత్వం మాత్రం.. ముందుగానే రాజధాని విశాఖలో ఏర్పాటవుతుందని చెప్పడంపై ప్రతిపక్షపార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..

రాజధాని నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి..
గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధాని అమరావతిగా నిర్ణయించారని మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్టణం రాజధానిని చేస్తాననడం సరికాదన్నారు. విశాఖలో కొన్ని భవనాలు, కార్యాలయాలు ఏర్పాటు చేసినంత మాత్రాన అది డెవలప్‌ చెందినదని అనుకోలేమన్నారు. అన్ని జిల్లాలను సమకోణంతో చూడాలని సూచించారు. తన ఉద్దేశంలో మాత్రం అమరావతి రాజధానిగా కొనసాగించాలని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు వచ్చే నెల 14న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడంపై ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఉగాది నుంచి సీఎం తన క్యాంపు కార్యాలయం విశాఖ కేంద్రంగా ప్రారంభించేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగుతోంది. ఈక్రమంలో జేడీ చేసిన వ్యాఖ్యలు, అభిప్రాయాన్ని ప్రభుత్వం ఏ మేరకు స్వీకరిస్తుందో వేచి చూడాలి.

ఆ నోట్లు రద్దు చేస్తే నల్లధనం బయటకు వస్తుంది..
రెండు వేల రూపాయల నోట్ల రద్దు అంశంపై మాట్లాడిన మాజీ జేడీ వాటిని రద్దు చేయాలన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకుల వద్ద నల్లధనం రూపంలో రెండు వేలరూపాయలు పెద్దఎత్తున ఉన్నాయని.. వాటిని రద్దు చేస్తే మంచిదన్నారు. ఆర్దిక వ్యవస్థను పటిష్టపరిచే సత్తా బ్యాంకులకే ఉందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎక్కడ స్కాం జరిగినా దానిని ప్రతీ ఉద్యోగి కేసు స్టడీగా తీసుకొని జాగ్రత్త పడాలని సూచించారు. తనకు అవగాహన ఉన్న మేరకు రెండు వేల రూపాయల నోట్లు బయట ఎక్కడా కనిపించటం లేదన్నారు. ఇక మోదీ తలపెట్టిన పాత నోట్ల రద్దు ఉద్దేశం నెరవేరలేదన్నారు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు అస్తున్నా.. లోప్‌ యాప్‌ల ఉచ్చులో ప్రజలకు ఎందుకు పడుతున్నారో ప్రభుత్వాలు గమనించాలని అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు సులువుగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా..
విశాఖ ఎంపీ స్థానం నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ జేడీ చెప్పారు. అయితే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో మాత్రం చెప్పలేదు. ఇటీవల బీఆర్‌ఎస్‌ నేతలు ఆయన్ని కలిసినట్లు సమాచారం. అయితే ఆ పార్టీలో చేరతారా లేదా అన్న దానిపై జేడీ స్పష్టత ఇవ్వలేదు. ఆయన గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన ఆలోచనలకు.. ఆశయాలను అనుగుణంగా ఉన్న పార్టీ తరపునే తాను ఎంపీగా మళ్లీ పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అంశాలను ఎన్నికల ప్రణాళికలో పెట్టిన పార్టీలోనే తాను చేరుతానని అన్నారు. అలాంటి పార్టీలు లేకపోతే తాను స్వతంత్రంగా పోటీ చేస్తానని తెలిపారు. అయితే రానున్న ఎన్నికల కోసం ముందు నుంచే వ్యూహాత్మకంగా విశాఖ అంశాలపైన ప్రత్యేకంగా జేసీ ఫోకస్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపైన ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. దీంతో.. లక్ష్మీనారాయణ ఎన్నికల నాటికి ఏదైనా పార్టీలో చేరుతారా.. స్వతంత్ర అభ్యర్ధిగానే బరిలో నిలుస్తారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.