KCR ప్రధాన సలహాదారుగా సోమేష్‌కుమార్‌ నియామకం

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana cm kcr) సలహాదారుడిగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(somesh kumar) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో సోమేశ్ కుమార్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారని ఉత్తర్వులలో పేర్కొన్నారు .తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియమించడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ పై జరిగిన అనేక రకాల ప్రచారాలకు తెరపడింది. ఏపీ ప్రభుత్వ సర్వీస్ నుంచి సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన గురించి పలు ఊహాగానాలు వినిపించాయి. ఆయన రెరా చైర్మన్ అవుతారని, సీఎం కేసీఆర్ సలహాదారుగా నియమితులవుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకొని త్వరలో ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలలో కీలక భూమిక పోషిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన పై జరిగిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ నేడు తెలంగాణ సీఎం ప్రధాన సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న ఆయన, తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక శాఖలలో కీలక పదవులు నిర్వహించి, 2019 డిసెంబర్లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.