సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
సికింద్రాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దక్కన్ మాల్ అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు. మృతుల్ని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. వీరిలో ముగ్గురు వరంగల్‌కు చెందిన వారు కాగా, ఇద్దరు మహబూబాబాద్, ఒకరు ఖమ్మం వాసులుగా పోలీసులు. గుర్తించారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. దాదాపు నాలుగు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటల తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు ముందుగానే స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నివాసాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. ఘటన స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అపోలో, యశోద ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
సికింద్రాబాద్ ఆర్పీ రోడ్‌లో ఎనిమిది అంతస్తులతో ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి అని ప్రత్యక్ష సాక్ష్యుల ద్వారా తెలుస్తోంది. మంటల్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన కొందరు పరుగుపరుగున కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చేశారు. కానీ కొందరు మాత్రం బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు. దట్టమైన పొగలు అలముకోవడంతో చాలామంది బయటకు రాలేకపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడం, లిఫ్టులు పని చేయకపోవడం, దట్టమైన పొగ కారణంగా చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో కొందరు లోపలే చిచ్కుకుపోయారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. దాదాపు 200 షాపులు, 160 ఆఫీసులు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.