ఏపీ అసెంబ్లీలో రగడ.. 12 మంది ఎమ్మెల్యేలు సస్సెండ్!
ఏపీ అసెంబ్లీలో నేటి సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. వైసీపీ- టీడీపీ నేతల మధ్య మాటామాట పెరిగి చివరికి సభ నుంచి సస్సెండ్ అయ్యేవరకు వెళ్లింది. ముందు నుంచే వైసీపీ ప్రభుత్వంతో విభేదిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ ఉదయం నుంచే తన నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని గళమెత్తారు. దీంతోపాటు ప్లకార్డులు చేతపట్టుకుని… అసెంబ్లీలోని ఆయన పోడియం వద్ద నిల్చునే నిరసన తెలిపారు. దీన్ని గుర్తించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల అవర్‌లో సభ్యులు మధ్యలో మాట్లాడకూడదని తెలిపారు. శ్రీధర్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. మీరు ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకోవాలంటే నేను తెలియజేస్తాను. మీరు చేస్తున్న ప్రొటెస్ట్‌ను హౌస్, తాను కూడా గుర్తించినట్లు స్పీకర్ తెలిపారు. మీరు ఇదే పనిగా చేయడం భావ్యంకాదు. మీరు కుర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుంది అని అని స్పీకర్ తమ్మినేని తెలిపారు.
అయినప్పటికీ వాటిని పట్టించుకోని కోటంరెడ్డి.. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సభలోని పోడియం ముందు నిల్చుని నియోజకవర్గ సమస్యలపై స్పీకర్‌కు కోటంరెడ్డి విజ్జప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి జోగి రమేష్.. శ్రీధర్ రెడ్డి నమ్మకద్రోహి అని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వ్యక్తి అని, జగన్ ఫోటో పెట్టుకుని, ఫ్యాన్ గుర్తుపై గెలిచి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. పథకం ప్రకారమే ఇదంతా జరుగుతోందని మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మరో మంత్రి అంబటి రాంబాబు సైతం శ్రీధర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోని టీడీపీ సభ్యుల డైరెక్షణ్‌లో ఆయన సభలో వ్యవహరిస్తున్నారని,,, ఇది ఉద్వేశపూర్వకంగా సాగుతోందని అన్నారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు 12 మంది సస్సెండ్..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ అసెంబ్లీకి ముందుగా వచ్చారని.. సీఎం జగన్ ఆలస్యం అయ్యారని.. జగన్ గవర్నర్ హోదా తగ్గించారని ఆయన మాట్లాడారు. ఇవాళ సభలో ఆయా అంశాల ప్రస్తావన వచ్చింది. సీఎం జగన్, గవర్నర్ కంటే ముందు వచ్చారని.. కావాలనే కేశవ్ ఆరోపణలు చేస్తున్నారని పలువురు మంత్రులు ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈక్రమంలో తన వివరణ కూడా వినాలని స్పీకర్‌ను పయ్యావుల కేశవ్ కోరారు. అయినా మైక్ ఇవ్వకపోవడంతో పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. అధికార పార్టీ మంత్రులు సుమారు 40 నిమిషాలు మాట్లాడారని తనకు కనీసం ఒక్క అవకాశం కూడా ఎందుకు ఇవ్వరని స్పీకర్‌ను కేశవ్ ప్రశ్నించారు. దీంతో సభను పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు మిస్ లీడ్ చేస్తున్నారని ఆరోపించి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం ఆమోదం లేకుండా సస్పెన్షన్‌లా..
ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ ఏవిధంగా చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో అప్పటికప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరలా వీరిద్దరిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని వారు పట్టుబట్టుకుని కూర్చున్నట్టున్నారు.. వీరందరినీ సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగదని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆయనతోపాటు మరో మంత్రి దాడిశెట్టి రాజా కూడా అదేవిధంగా స్పందించడంతో.. టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. కానీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోపాటు, టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడిని ఈ సెషన్ మొత్తానికి సస్సెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.