వీడెక్కడి బాలుడు రా బాబు.. జాతిరత్నం అంతే!
ప్రస్తుత తరం పిల్లల మేధస్సు, వారి అవగాహన స్థాయిలను చూస్తే చాలా మంది ఆశ్చర్యపోవాల్సిందే. టెక్నాలిజీ భాషలో చెప్పాలంటే.. ఇప్పుటి బుడతలందరూ అప్గ్రేడ్ వర్షన్లు అనే చెప్పాలి. 90వ దశకం.. అంతకు ముందు పుట్టిన వారందరూ చిన్నతనం నుంచి కొంత భయంతో పెరిగినవారే. కానీ నేటి పిల్లలు మాత్రం చాలా వరకు ధైర్యవంతులే. కొందరివైతే తెలివితేటలు కాదు దేశ ముదురు, ముదురు తెలివితేటలు అని చెబుతుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు ఈ బాలుడు.. వీడు చదువుతున్నది అయిదో తరగతి అయినప్పటికీ… వీడికున్న విషయ పరిజ్ఞానం ఎంత గొప్పదో మీరే చూడండి.
ఈ బాలుడు ఎవరో, ఎక్కడ చదువుతున్నాడో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇతను రాసిన పరీక్ష పేపర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 5వ తరగతి పరీక్షలో అడిగిన ఓ ప్రశ్నకు ఈ బాలుడు రాసిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘స్వాతంత్య్రానికి ముందు మీరు సంఘ సంస్కర్త అయితే ఏ సామాజిక దురాచారాన్ని నిర్మూలించాలనుకుంటున్నారు’? అని పరీక్షలో ప్రశ్న ఇవ్వగా.. ఆ బాలుడు ఇలా స్పందించాడు. “నేను సంఘ సంస్కర్త అయితే వితంతవులకు పునర్వివాహ చట్టాన్ని ప్రారంభించి, వాళ్లు సంతోషకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తాను” అని రాసుకొచ్చాడు. దీంతోపాటు వితంతువులు తెల్లచీరలు కట్టుకుంటారని, వారు జడలు వేసుకోరని.. ఇళ్లలో నుంచి బయటకు రారని పరీక్షలో రాసుకొచ్చాడు. వితంతువులకు మళ్లీ పెళ్లి చేస్తే అవన్నీ పోతాయని ఆ బాలుడు ఎంతో మెట్యూరిటీతో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఇది సిలబస్లో ఉందో లేదో తెలియదు కానీ.. ఆ బాలుడు అవగాహన రాసిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఇప్పటి పిల్లలు సైతం అప్గ్రేడ్ అవుతున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్క విషయాన్ని అందరూ తెలుసుకుంటున్నారు. సమాజాన్ని సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని ఈ ఘటనతో తెలుస్తోంది.