Pune Accident: అదే ఆఖరి మాట.. కన్నతండ్రి రోదన
Mumbai: మహారాష్ట్ర(Maharashtra)లో ఇవాళ ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. రాయగడ్ జిల్లాలో ఓ బస్సు ప్రమాదవశాత్తు(pune accident) లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడ మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పుణె నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ముంబై-పుణె పాత హైవేపై ఉన్న శిన్‌గ్రోబా ఆలయం సమీపంలో ఉన్న లోయలో బస్సు పడింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గోరేగావ్‌లోని ఓ సంస్థకు చెందిన వ్యక్తులు అంతా పుణెకు వెళ్లి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే బస్సు పూర్తిగా నుజ్జునుజ్జు అయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
అయితే.. ప్రమాదానికి కొన్ని గంటల ముందే తన కూతురితో మాట్లాడానని ఓ తండ్రి రోదిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో రుయీ అనే 18 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. ఓ ఈవెంట్ కోసం రుయీ పుణె వెళ్లిందట. “క్షేమంగా చేరాగానే ఫోన్ చేస్తా నాన్నా” అని చెప్పిన కూతురు.. కొన్ని గంటల్లోనే శవమై ఇంటికొస్తుందని ఆ కన్నతండ్రి ఊహించలేకపోయాడు. అవే తన కన్నబిడ్డ చివరి మాటలు అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. రెయిలింగ్స్ లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని, అవి ఉండుంటే.. కనీసం గాయాలతోనైనా బయటపడేవాళ్లమని బాధితులు వాపోతున్నారు.