ఫ్యామిలీ డాక్ట‌ర్ కాన్సెప్ట్‌ అదుర్స్‌… జగన్‌ ప్లాన్‌ కూడా అదే!

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి… ఆరోగ్య శ్రీ పథకం, 108 వాహనాలను తీసుకొచ్చి ఎంతో మందికి అనారోగ్య సమస్యలు తీర్చి.. ప్రాణాలు నిలిపిన నేతగా పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఆ పథకాలే రాజశేఖర్‌ రెడ్డికి ప్రజల మద్దతును తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పుడు అదే పంథాలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా వెళ్తున్నారని అనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, 108, 104 వాహనాలు అందుబాటులో ఉండగా.. వీటికి అనుసంధానం చేస్తూ.. నూతన పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. అదే.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌. ఈ పథకాన్ని విజయవంతం చేస్తే మాత్రం.. అనేక మంది పేద, మధ్యతరగతి ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి దగ్గరైనట్టు.. సీఎం జగన్‌ కూడా దగ్గరయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ విధానం ఎంత వరకు అమలవుతుంది.. ప్రజలకు ఎలాంటి వైద్య సదుపాయాలు ఒనగూరుతాయని అన్నది చూడాల్సి ఉంది.

ఏపీలో మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సంద‌ర్బంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జ‌రిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అధికారులు స‌న్న‌ద్ధంగా ఉండాలని సీఎం జ‌గ‌న్ తెలిపారు. ఈ సంద‌ర్బంగా అధికారులు మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్‌ పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 45,90,086 మందికి ఆరోగ్య సేవలు విజ‌య‌వంతంగా అందించామని సీఎం తెలియ‌జేశారు. అలాగే 1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తి చేశామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. దీర్ఘకాలిక సెలవులు, పీహెచ్‌సీ వైద్యులు అందుబాటులోని లేని స‌మ‌యంలో.. సేవలకు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు సీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులను ఇక్కడ వినియోగించుకుంటామని, దీని కోసం అదనపు నియామకాలకు కూడా చేశామని తెలిపారు. ప్ర‌త్యేకంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కోసం ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను నియమించుకున్నామని అధికారులు పేర్కొన్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ అంటే ఏంటంటే?
ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించే ల‌క్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ ను తీసుకొచ్చామ‌ని వైసీపీ ప్ర‌భుత్వం చెబుతోంది. ఇప్ప‌టికే మూడు నెల‌ల పాటు రాష్ట్రంలోని ప‌లు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమ‌లు చేసి లోటుపాటుల‌ను గుర్తించి వాటిని స‌వ‌రించుకుని.. త్వ‌ర‌లో ఈ విధానాన్ని అమ‌లు చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఫ్యామిలీ డాక్ట‌ర్ కాన్సెప్ట్ అంటే… సాధారణంగా ప్ర‌తి మండ‌లానికి రెండు నుంచి మూడు పీహెచ్‌సీలు మేజ‌ర్ పంచాయితీల్లో ఉంటాయి. కొన్ని చిన్న గ్రామాల్లో అవి ఉండ‌వు. ఈ పీహెచ్‌సీల‌ల్లో ఇప్ప‌టికే ఇద్ద‌రు వైద్యులు ఉంటున్నారు. వీరిలో ఒక‌రు ఆసుప‌త్రిలోనే ఉంటారు.. మ‌రొక‌రు మాత్రం 104 వాహ‌నం ద్వారా పీహెచ్‌సీ లేని గ్రామాల్లో ప‌ర్య‌టించి.. అక్క‌డే ఓపీలు స్వీక‌రించి.. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి.. ఉచితంగా మందులు అంద‌జేస్తారు. అంతేకాకుండా గ్రామంలోని అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు వెళ్లి పిల్ల‌ల ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకుంటారు. దీంతోపాటు దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతూ.. మంచానికే ప‌రిమిత‌మైన రోగుల ఇళ్ల వ‌ద్ద‌కు నేరుగా డాక్ట‌ర్లు వెళ్లి వారికి అవ‌స‌ర‌మైన మందులు, వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.

వైద్యులు, సిబ్బంది, మందుల కొర‌త లేకుండా ఏర్పాట్లు..
వాస్త‌వానికి ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానానికి అద‌నంగా వైద్యులు, సిబ్బంది నియామ‌కం చేప‌ట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్ప‌టికే ఆ ప్ర‌క్రియ‌ను పూర్తి చేశామ‌ని సీఎం జ‌గ‌న్‌కు వైద్యాధికారులు వివ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో వైద్యుల నియామకాలను భర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. వైద్యసేవలకు అంతరాయం లేకుండా ప్రతి 6,7 పీహెచ్‌సీలకూ ఒక డాక్టర్‌ను అదనంగా నియమించుకున్నామని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో పెట్టుకున్నామన్నారు. 10,032 విలేజ్‌హెల్త్‌ క్లినిక్స్‌లో ప్రతి క్లినిక్‌కూ ఒక ఏఎన్‌ఎం చొప్పున ఉంటున్నార‌న్నారు. వీరితో పాటు ఒక సీహెచ్‌ఓ, ముగ్గురు లేదా నలుగురు ఆశా కార్యకర్తలు ఉంటార‌ని.. విలేజ్‌హెల్త్‌క్లినిక్స్, అలాగే 104లలో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచామని అధికారులు తెలిపారు. మందులు కూడా ఇదివరకు ఇస్తున్న 67 రకాలతోపాటు.. కొత్త‌గా ఆ సంఖ్యను 105 ర‌కాలకు పెంచామని వెల్లడించారు. అలాగే 14 రకాల డయాగ్నోస్టిక్‌ కిట్లను కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో పెట్టామని తెలిపారు.