పాన్‌కార్డు-ఆధార్‌తో లింక్ గడువు పొడిగింపు
పాన్‌కార్డును ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్స్ డిపార్ట్ మెంట్ గత ఏడాది నుంచి పదేపదే చెబుతోంది. అయితే.. ఈ నెల 31లోపు వెయ్యి రూపాయల ఫైన్‌తోటి పాన్ లింక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే.. వినియోగదారులు మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని కోరడంతో.. ఈ గడువును ఈ ఏడాది జూన్ 30 తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ పేర్కొంది. ఈ మేరకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆధార్‌తో పాన్ లింక్ ఎందుకు చేయాలంటే..
భారత్‌లో ఒక్కొక్కరు ఇప్పటికే రెండు మూడు పాన్ కార్డులు వాడుతున్నట్లు సీబీడీటీ వద్ద సమాచారం ఉంది. దీని వల్ల వారు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తే.. అవినీతికి తావు లేకుండా ఉంటుందని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆలోచన. ఈక్రమంలోనే గత కొంతకాలంగా ఆధార్‌తో పాన్ లింక్ చేయించుకోవాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీంతోపాటు ప్రతి ఒక్కరి KYCలో పాన్, ఆధార్ ముఖ్యమైన భాగం. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనివల్ల నకిలీ పాన్ కార్డుల వినియోగాన్ని నిరోధించవచ్చని అధికారులు అనుకుంటున్నారు. పాన్‌ను ఆధార్ సంఖ్యతో అనుసంధానించడంలో విఫలమై పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే, అప్పుడు సదరు పన్ను చెల్లింపుదారు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయలేడు. అలాగే, కొత్త పాన్ పొందేందుకు ఆధార్‌ను ఇవ్వడం తప్పనిసరి. ఆధార్ – పాన్ లింక్ చేయకపోతే ఈ విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో పాటు… కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ లేదా డీమ్యాట్ అకౌంట్ వంటివి కూడా ఓపెన్ చేయలేడు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా వీలు లేకుండా పోతుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 (‘చట్టం’) నిబంధనల ప్రకారం, 1 జులై, 2017 నాటికి పాన్ కార్డు పొందిన వారందరూ తప్పనిసరిగా ఆధార్‌తో పాన్ లింక్ చేయించుకోవాలని కోరుతున్నారు.