‘ప్రతి క్షణం భయంతో గడిపాను’

బాలీవుడ్ సీనియర్​ హీరోయిన్ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. తన నటనతో ఏకంగా ఏడు ఫిలిం ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. తన అందం, నటనతో బాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్​ క్రియేట్​ చేసుకున్న రాణీ ముఖర్జీ కెరీర్ పీక్​లో ఉన్నప్పుడే 2014లో స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకుని కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ భామ పంచుకున్న విషయాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

‘పెళ్లి అయ్యాక సంవత్సరానికే నాకు పాప పుట్టింది. అయితే నేను డెలివరీ టైమ్​లో అనుభవించిన నరకం ఎవ్వరికీ రాకూడదు. పాప రెండు నెలల ముందే అంటే ఏడో నెలలోనే పుట్టింది. పూర్తిగా ఎదగక పోవడం వల్ల చాలా సన్నగా తక్కువ బరువుతో పుట్టింది. దాంతో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో నేను పడిన టెన్షన్‌, బాధ, మానసిక ఒత్తిడి ఏ తల్లికీ రాకూడదు. అంతేకాదు, బేబీ రెండు నెలల ముందుగానే పుట్టడంతో ఏడు రోజులు ఐసీయూలోనే ఉంచారు. మొత్తం 15 రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సిన పరిస్థితి. ఆ సమయంలో తీవ్రంగా కుంగిపోయాను. ఏం జరుగుతుందోననే భయంతోనే ప్రతి క్షణం గడిపాను. అయితే, అదృష్టం కొద్దీ నా బిడ్డ సేఫ్‌గా ఉంది. నా దగ్గరకు తిరిగి వచ్చింది’ అంటూ తాను తల్లి అయిన సందర్భంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు రాణీ ముఖర్జీ. అప్పటి కఠిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా తన కూతురు భవిష్యత్తు గురించి మాట్లాడుతూ తాను హీరోయిన్‌ అయినంత మాత్రాన తన కూతురు అదిరా కూడా పబ్లిక్‌ లైఫ్‌లో ఉండాలని అనుకోవడం లేదని అన్నారు. అంతేకాదు, ఆమె ప్రైవసీని కాపాడడం కూడా తన బాధ్యత అని తెలిపారు. అదే సమయంలో అదిరాను సామాన్యురాలిగా పెంచడం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు.
రాణీ ముఖర్జీ ఆమె పాపకు అదిరా అనే పేరు పెట్టారు. పాప పుట్టిన తర్వాత నటనకు కొంత విరామం ఇచ్చిన ఈ బాలీవుడ్ భామ.. 2018లో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మర్దానీ2, బంటి ఔర్‌‌ బబ్లీ2 సినిమాల్లో నటించింది. తాజాగా మెసేజ్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాల్లో నటిస్తోంది రాణీ ముఖర్జీ.