‘నేను బతికే ఉన్నా.. ఆ వార్తలు ఎవరూ నమ్మొద్దు’
తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగిన నటుల్లో ఒకరు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు. ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే దిగ్గజ నటుడు కోట. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ కోట ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. వృద్ధాప్య కారణాల రీత్యా ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కోట శ్రీనివాసరావు మరణించారనే ఓ అసత్య వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయంపై కోట స్పందించారు. ఆయనే స్వయంగా ఓ వీడియో ద్వారా తన క్షేమ సమాచారాన్ని పంచుకున్నారు. తాను ఆర్యోగంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దని కోరారు.
‘నేను మృతి చెందినట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. నా ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని వస్తున్న వార్తలన్నీ అసత్యాలే. నేను ఆరోగ్యంగానే ఉన్నా. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ప్రచరాం చేయడం భావ్యం కాదు. ఈ వార్తలు చూసి నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కలత చెందారు. అంతా ఫోన్లు చేసి పరామర్శించడం చాలా ఇబ్బంది కలిగించింది. వదంతులు నమ్మొద్దు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు చేయడం ఓ వ్యాపారంలా భావిస్తున్నారేమో. ఇటీవల గాయని సుశీలపై కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆమె కూడా చివరికి నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. నన్ను 40 సంవత్సరాల నుంచి ఓ కళాకారుడిగా ప్రేక్షకులు పోషిస్తున్నారు. 70 ఏండ్లు వచ్చాయి. అయినా, నా అదృష్టం కొద్దీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలేం లేవు. బతికున్న నన్ను చంపెయ్యకండి’ అంటూ కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని.. తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాసరావు కోరారు.
సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. తరచుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. కొందరు తమ పేరు కోసం, డబ్బుకోసం ఇలాంటి అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారు. కాస్త వయస్సు పైబడిన నటీనటులు, ఆరోగ్యం బాలేక ఆసుపత్రి పాలైన కొందరు నటులపై కూడా ఇలాంటి వార్తలు కోకొల్లలుగా వస్తూనే ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ వ్యూస్ కోసం ఇలా బతికి ఉన్న వాళ్లను చంపేయడం నిజంగా హేయకరమైన విషయం.