ఎన్నికలు అపహాస్యం అవుతున్నాయి.. చర్యలు తీసుకోరా అంటూ చంద్రబాబు ఫైర్‌!

రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉదయం నుంచే మంతనాలు జరుపుతున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. అక్రమాలను అడ్డుకున్న టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని పార్టీ నేతలు అధినేతకు వివరించారు. అనంతరం సీఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల్లో పలు అక్రమాలను, ఉల్లంఘనలకు వివరించి తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు. ఎన్నికలను అపహాస్యం చేస్తోందని లేఖలో ఆయన స్పష్టం చేశారు.

అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం..
తిరుపతి పట్టణంలో 9వ తరగతి విద్యార్హత కలిగిన విజయ అనే మహిళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమ ఓటు వేశారన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైసీపీ అనుచరులు రమణ మహర్షి స్కూల్ వద్ద డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పోలింగ్ బూత్‌లలోకి అక్రమంగా ప్రవేశించారు. పోలింగ్ బూత్ నెం. 233, 233ఏ లలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. బోగస్ ఓట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత దేవనారాయణరెడ్డిని అక్రమంగా పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఒంగోలు పట్టణంలో టీడీపీ టెంట్ వేయడానికి అంగీకరించని పోలీసులు వైసీపీ నాయకులకు మాత్రం అనుమతి ఇచ్చారు. విశాఖలోని 53వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బర్కత్ అలీ ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ వీడియోలో పట్టుబడ్డారు. బోగస్ ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తిరుపతి పట్టణంలో టీడీపీ నేతలు నర్సింహ యాదవ్, ఇతర నేతలను అరెస్టు చేశారు. వైసీపీ బోగస్ ఓట్లకు సహకరించేందుకే పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నారు. తిరుపతి పట్టణంలో వైసీపీ బోగస్ ఓట్లను ప్రశ్నించిన టీడీపీ నాయకుడు, పోలింగ్ ఏజెంట్ పులిగోరు మురళిని అక్రమంగా అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ ఘటనలకు సంబంధించి ఆధారాలు పంపుతున్నట్లు చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందని చంద్రబాబు ఆరోపించారు. పట్టభద్రులు ఓటు వేయాల్సిన ఈ ఎన్నికల్లో అనర్హులు, నిరక్ష్యరాస్యులతో వైకాపా నేతలు బోగస్‌ ఓట్లు వేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై రాజకీయపక్షాలు చేసే ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరుపతిలో బోగస్‌ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్న.. వైసీపీ నాయకులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా.. ఏ అధికారి, పోలీసులు పట్టించుకోవట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి ఉషా శ్రీచరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్‌కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని.. ఓటుకు రూ.1000 పంచాలని స్వయంగా మంత్రి చెప్పారని ఆయన వివరించారు.