కవితకు మరోసారి ఈడీ నోటీసులు.. ఈసారి రావాల్సిందేనట
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత వర్సెస్ ఈడీ వార్ వాడీవేడిగా జరుగుతోంది. ఈ నెల 11న తొలిసారి ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఆ రోజు ఎనిమిది గంటలకు పైగా ఈడీ అధికారులు విచారణ కొనసాగించారు. ఆమె ఫోన్ సైతం సీజ్ చేశారు. కాగా.. మళ్లీ ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. అయితే తనకు ఆరోగ్యం బాలేదని.. మరో తేదీన రమ్మంటే వస్తానని చెప్పడంతో ఈ నెల 20న విచారణకు రావాలని ప్రస్తుతం ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరి ఈసారైనా కవిత విచారణకు వెళ్తారా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
రామచంద్ర పిళ్లైని కూడా విచారించే అవకాశం..
కవితను ఈ నెల 20న ఈడీ విచారించనున్న నేపథ్యంలో 20 వరకు రామచంద్ర పిళ్ళై కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. వాస్తవానికి ఇవాళ వీరితోపాటు, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుని సైతం విచారించాలని ఈడీ ముందుగానే నిర్ణయించుకుంది. అయితే కవిత.. గైర్హాజరుతో.. వారిని సైతం ఈ నెల 20న విచారిస్తారని సమాచారం. ఇప్పటికే పలుమార్లు రామచంద్ర పిళ్లై స్టేట్‌మెంట్లను ఈడీ తీసుకుంది. అతను రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కవిత కోసమే తాను లిక్కర్ స్కాంలో భాగమైనట్లు పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో కవిత నుంచి అసలు విషయాలు రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది.
మరోవైపు రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఎమ్మెల్సీ కవితతో కలిపి పిళ్లైను విచారించాల్సిన అవసరం ఉందని ఈడీ తరపున కోర్టులో వాదనలు వినిపించారు. పిళ్ళై కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని ఈడీ అధికారులు కోరినట్లు సమాచారం.
విచారణకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. ఏపీలోనూ కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఈ నెల 18న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవ రెడ్డి తనకు బెయిల్ కావాలని కోర్టును కూడా ఆశ్రయించారు. ఇవాళ దీనిపై కోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.