క‌విత ఫోన్ల చుట్టూనే ఈడీ విచార‌ణ‌.. అన్ని ఫోన్లు ఎందుకు?

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో సెల్‌ఫోన్ల అంశం పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అంద‌రూ దాదాపు అనేక ఫోన్లు మార్చారు. ఈ కుంభకోణంలో కవితతో సహా 36 మంది 70 పోన్లను మార్చారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే మంగ‌ళ‌వారం ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి విచార‌ణ నిమిత్తం వెళ్లిన క‌విత‌.. త‌న వెంట గ‌తంలో వాడిన ఫోన్లను కూడా తీసుకెళ్లారు. వాటిని రెండు సంచుల్లో తెచ్చిన తన మొబైల్‌ ఫోన్లను మీడియాకు చూపిస్తూ ఈడీ కార్యాల‌యానికి క‌విత వెళ్లారు. ఈ కుంభకోణం జరిగిన సమయంలో వాడిన ఫోన్లన్నీ తేవాల్సిందిగా ఈడీ అధికారులు ఆదేశించడంతో ఆమె వాటిని తీసుకుని వెళ్లక తప్పలేదు. గతంలో తాను వాడిన ఫోన్లన్నింటినీ తెమ్మన్నందుకు క‌విత నిరసన తెలిపారు. ఈడీ అధికారి జోగీందర్‌కు బ‌హిరంగ లేఖ కూడా రాశారు. విచార‌ణ‌కు వెళ్లే ముందు ఆమె ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని అందులో ఆరోపించారు. ఒక మ‌హిళ ఫోన్లు విచార‌ణ కోసం తీసుకోవ‌డం వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించ‌డ‌మేన‌ని ఆమె అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను ఈడీ కోరిన విధంగా అన్ని ఫోన్లను సమర్పిస్తున్నాన్నారు.

ప‌ది ఫోన్లు ఎందుకు మార్చారు..
ఎమ్మెల్సీ క‌విత గ‌త ఏడాది కాలంలో సుమారు 10 సెల్‌ఫోన్ల‌ను మార్చార‌ని ఎప్ప‌టి నుంచే వినిపిస్తోంది. ఈ విష‌యంపై ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో కూడా క‌విత‌ను ప్ర‌శ్నించ‌గా.. త‌న‌కు కొత్త ఫోన్లు కొన‌డం అంటే ఇష్ట‌మ‌ని.. అందుకే కొంటున్నాన‌ని పేర్కొన్నారు. దీంతోపాటు పాత ఫోన్ల‌ను బంధువులు, ఇంట్లో ప‌నిచేసే వారికి ఇస్తాన‌ని తెలిపారు. అయితే ఈడీ విచార‌ణ మాత్రం ఆమె వాడిని ఫోన్ల గురించే కొన‌సాగింద‌ని స‌మాచారం. ‘అన్నిసార్లు ఫోన్‌లు ఎందుకు మార్చారు? ఒకే రోజు రెండు ఫోన్లు ఎందుకు వాడారు? వెంటవెంటనే వాటిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ ..అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఎమ్మెల్సీ కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.40 గంటల వ‌ర‌కు కొన‌సాగిన ఈడీ విచార‌ణ‌లో క‌విత‌ను ప్ర‌ధానంగా ఫోన్ల వినియోగం అంశం గురించే అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. కవితతోపాటు.. శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు ఫోన్లను మార్చడం గురించి కూడా వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మార్చిన అన్ని ఫోన్లలో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి వారు ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి ఆరా తీసినట్లు సమాచారం.

ఈడీ విచార‌ణ‌పై క‌విత మండిపాటు..
మహిళల‌ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం వారి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం క‌లిగించ‌డ‌మేన‌ని కవిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాల‌ను ఆమె త‌న లేఖ‌లో పేర్కొన్నారు. తన ఫోన్లను ధ్వంసం చేశానని గతంలో ఈడీ పేర్కొవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సమన్లు జారీ చేయకుండా, తనను అడగకుండా ఈడీ ఈ ఆరోపణలు ఎందుకు చేసిందని ప్రశ్నించారు. ఈడీ తనను తొలిసారి మార్చి 11న విచారణకు పిలిచిందని.. కానీ గత ఏడాది నవంబర్‌లోనే తాను ఫోన్లను ధ్వంసం చేశానంటూ దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసిందని కవిత విమర్శించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణల మూలంగానే రాజకీయ ప్రత్యర్థులు తనను నిందిస్తున్నారని.. తద్వారా తన ప్రతిష్ఠకు, పార్టీ ప్రతిష్ఠకు తీవ్రభంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ నెల 11న క‌విత ప్ర‌స్తుతం వినియోగిస్తున్న ఫోన్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోగా.. మంగ‌ళ‌వారం గ‌తంలో ఆమె వాడిన 10 ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక మంగ‌ళ‌వారం విచార‌ణ ముగిసిన అనంత‌రం క‌విత ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. ఆమె వెంట భ‌ర్త అనిల్‌, సోద‌రుడు కేటీఆర్ త‌దిత‌రులు ఉన్నారు.