కవితపై ED ప్రశ్నల వర్షం.. నేటి విచారణ కీలకం!

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను సోమవారం దాదాపు 10 గంటలకు పైగా సుధీర్గ విచారణ ఈడీ చేపట్టింది. ఈ విచారణలో పలు కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఈనేపథ్యంలో మరోసారి మంగళవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఈడీ నిన్ననే ఆమెకు నోటీసులు అందించడం సంచలనంగా మారింది. మంగళవారం విచారణ తర్వాత ఈడీ కవితను అరెస్టు చేస్తుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. సోమవారం జరిగిన విచారణలో దాదాపు ముగ్గురు నుంచి అయిదుగురు అధికారులు కవితకు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ప్రధానంగా ఢిల్లీలోని రాజకీయ వ్యక్తులతో ఉన్న సంబంధాలు, సౌత్‌గ్రూప్‌లో పెట్టుబడులు, హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌, ఢిల్లీలో ఒబెరాయ్‌ హోటల్‌ సమావేశాలకు సంబంధించిన పత్రాలను ఆమెకు చూపించి ప్రశ్నించారని సమాచారం. రామచంద్ర పిళ్లై సౌత్‌ గ్రూప్‌ తరపున, కవిత తరఫున జరిపిన సంభాషణలనూ వారు ఆమెకు వినిపించి, ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

సుమారు 14 ప్రశ్నలు సంధించిన ఈడీ…
ఉదయం 11 గంటలకే విచారణకు హాజరైన కవిత.. దాదాపు గంటపాటు అధికారులు ఎవరూ కార్యాలయానికి రాలేదు. అనంతరం ఓ ప్రత్యేక గదిలో ఏకాంతంగా కవితను విచారించినట్లు సమాచారం. అందులో భాగంగా సుమారు 14 ప్రశ్నలను అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. కవిత గతంలో సమర్పించిన బ్యాంకు స్టేట్‌మెంట్లలో అనుమానాస్పద ఎంట్రీల గురించి, ఆమె నుంచి స్వాధీనపరుచుకున్న మొబైల్‌ ఫోన్‌ డేటా ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. మనీశ్‌ సిసోడియాతో ఆమెకున్న రాజకీయ సంబంధాలు, ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌తో భేటీకి కారణాలు,, హైదరాబాద్‌లో ఇండో స్పిరిట్‌ యజమాని సమీర్‌ మహేంద్రును కలుసుకున్న సందర్భం గురించి కూడా వారు ప్రశ్నించారు. కవిత దాదాపు 10 ఫోన్లు మార్చారు.. వాటిని ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులతో ఉన్న వ్యాపార సంబంధాల గురించి.. వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు.

ముఖాముఖి విచారణ ఎందుకు జరగలేదంటే..
ఎమ్మెల్సీ కవితతోపాటు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్‌పిళ్లైని ముఖాముఖిగా విచారించాలని.. ఇద్దరికీ సంబంధించి పలు ప్రశ్నలు వేసేందుకు అధికారులు తొలుత భావించారు. కానీ అందుకు పిళ్లై అంగీకరించలేదని సమాచారం. దీంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు ముందు ఆయన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈడీ కస్టడీ ముగియడంతో అతన్ని జైలుకు పంపించారు. ఇక ఈ కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి ఈడీ వద్ద ఉన్న ఆధారాలు, సాక్ష్యుల వివరాలతో ఆమెను అధికారులు ప్రశ్నించారు. దాదాపు సోమవారం 9.15 గంటల వరకు విచారించిన ఈడీ చివరికి ఆమెను బయటకు పంపారు. అనంతరం కవిత ఢిల్లీలోని తన తండ్రి కేసీఆర్‌ నివాసానికి వెళ్లిపోయారు. మంగళవారం తిరిగి 11 గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ కవితకు నోటీసులు ఇచ్చారు. నేటి విచారణతో కలిపి దాదాపు మూడు సార్లు ఈడీ విచారించినట్లు అవుతుంది. ఈనేపథ్యంలో ఇవాళ జరిగే విచారణ కీలకం కాబోతోందని సమాచారం.