ఏపీ, తెలంగాణాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులు ఎవరంటే?
ఏపీ, తెలంగాణ రాష్ట్రల్లో కలిసి ఖాళీ కానున్న మొత్తం పది ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు ఫలితాలను ఈసీ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. ఈ నెలాఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే.. శాసన మండలి సభ్యులు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా.. ప్రస్తుత సభ్యులుగా ఉన్న నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈ స్థానాల్లో ఎమ్మెల్సీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27నే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించగా సోమవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏపీ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు.
నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి మరియు రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి ఫారమ్-1 ద్వారా సోమవారం ఎన్నికల ప్రకటన చేశారు. ఎంఎల్సి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసేవారు.. స్వయంగా లేదా.. వారి ప్రతిపాదకులు అమరావతి పరిధిలోని వెలగపూడి రాష్ట్ర శాసనసభా భవనంలో అందజేయాలని సూచించారు. ఈనెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14న అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 16వ తేది మధ్యాహ్నం 3గం.ల వరకూ నామినేష్ల ఉసంహరణకు గడువు ఉంటుందని ఆలోపు ఎవరైనా అభ్యర్ధులు వారి నామినేష్లనను ఉపసంహరించు కోవాలనుకుంటే అభ్యర్ధిత్వ ఉపసంహరణ నోటీసును అభ్యర్ధి లేదా వారి ప్రతిపాదకుడు లేదా వ్రాత పూర్వకంగా అందించేందుకు అధికారం పొందిన వారి ఎన్నిక ఏజెంటు గాని రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారికి కాని అందజేయాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఉన్న పక్షంలో ఈనెల 23న ఉదయం 9గం.ల నుంచి సాయంత్రం 4 గం.ల వరకూ అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఏపీ నుంచి అభ్యర్థులు వీరే..
సూర్యనారాయణ రాజు(విజయనగరం), పోతుల సునీత(బాపట్ల), కోలా గురువులు(వైజాగ్), బొమ్మి ఇజ్రాయేల్(కోనసీమ), జయమంగళ వెంకటరమణ(ఏలూరు), చంద్రగిరి ఏసురత్నం(గుంటూరు), మర్రిరాజశేఖర్(పల్నాడు).
తెలంగాణలో ఇదీ పరిస్థితి..
తెలంగాణ రాష్ట్ర పరిధిలో మూడు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలు ఈ నెల 29తో ఖాళీ కానున్నాయి. వీటిని కూడా భర్తీ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. దీంతో ఇక్కడ కూడా ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఏది ఏమైనా బీఆర్‌ఎస్ నుంచే అభ్యర్థులు బరిలో నిలుస్తారని సమాచారం.