175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము మీకుందా? – సీఎం జగన్‌ ఫైర్‌

వచ్చే ఎన్నికల్లో క్లాస్‌ వార్‌ జరగనుందని.. ఒకవైపు పేదల ప్రభుత్వం.. మరోవైపు పెత్తందారి చంద్రబాబుకి మధ్య యుద్ధం జరగబోతోందని… మీరందరూ ఎవరివైపు నిల్చుంటారో నిర్ణయించుకోండి అంటూ తెనాలిలో నిర్వహించిన సభలో సీఎం జగన్‌మోహ‌న్ రెడ్డి దాటిగా మాట్లాడారు. తాము చేసిన మంచి కార్యక్రమాలపై నమ్మకం ఉండటం వల్లే రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో ధైర్యంగా పోటీ చేసి.. గెలుస్తామని చెబుతున్నామని.. ఇదే 175 స్థానాల్లో ఒంటరిగా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌ పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉన్నాయా అంటూ సీఎం జగన్‌ సవాలు విసిరారు. అంతకుముందు గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన నాలుగో ఏడాదికి సంబంధించిన వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహ‌న్ రెడ్డి పాల్గొని.. బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలకు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రానున్న ఎన్నికలు చాలా కీలకం.. ప్రజలు ఓటు వేసే ముందు ఈ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో లబ్ది జరిగిందా లేదా అన్నది ఆలోచించుకోండి. నాకు చంద్రబాబు లాగా అనుకూల మీడియా వ్యవస్థలు, దత్తపుత్రడు లేడు.. నేను మీ బిడ్డను.. మిమ్మల్నే నమ్ముకున్నాను. చంద్రబాబు, దత్తపుత్రుడు మాటలు నమ్మి ఈసారి తప్పుచేస్తే రాష్ట్రం నష్టపోతుంది. చంద్రబాబు పని దోచుకో.. పంచుకో.. తినుకో.. ప్రస్తుతం ఈ ముఠాలో దుష్టచతుష్టయానికి తోడు.. దత్తపుత్రుడు జతకట్టాడని’ సీఎం జగన్‌ మండిపడ్డారు.

మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో మంచి జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 98.5 శాతం వరకు సంక్షేమ పథకాల అమలు చేసినట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేశాం అందుకే మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందని జగన్ అన్నారు. వైసీపీ పేదల ప్రభుత్వమని.. చంద్రబాబుది పెత్తందారీ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన ప్రతి హామీని నెర్చవేర్చాం కాబట్టే.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్తున్నారని తెలిపారు.


కరవుతో చంద్రబాబు ఫ్రెండ్షిప్‌..

తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరుణ దేవుడి ఆశీసులతో అన్ని ప్రాంతాల్లో సమృద్దిగా వర్షాలు కురిశాయని సీఎం జగన్‌ తెలిపారు. అదే చంద్రబాబు హయాంలో కరవు తాండవించిందని పేర్కొన్నారు. చంద్రబాబు కరవుతో ఫ్రెండ్షిప్‌ చేస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పెత్తందారులకు అవకాశం ఇచ్చి.. పొరపాటు చేస్తే పేదవాడు మిగలడని ఆయన అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత చాలా అవసరమని.. అది లేకపోతే రాజకీయాలకు ఎవరూ పనికి రారని అదే తాను నమ్ముతున్నట్లు సీఎం తెలిపారు. మీ కుటుంబంలో మంచి జరిగింది అనుకుంటే.. అదే ప్రామాణికంగా మీ బిడ్డ ప్రభుత్వానికి అండగా నిలబడాలని జగన్ కోరారు. తాను ఎవ్వరినీ నమ్ముకోలేదని.. ఆ దేవుడి దయ.. ప్రజల చల్లనిదీవెనలు ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చివరిగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.