ఈ ల‌క్ష‌ణాలుంటే స్కూళ్లకు పంపొద్దు – ఏపీ మంత్రి రజినీ సూచన

వాతావరణ మార్పులు, ఇన్ఫ్లూయింజా ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బందులు పడుతున్న బాధితులు ఎక్కువయ్యారు. ఈక్రమంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని కీలక ప్రకటన చేశారు. ఫ్లూ లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతున్న పిల్లలను స్కూళ్లకు పంపొద్దని తల్లిదండ్రులకు మంత్రి సూచించారు. అదేవిధంగా వారికి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జ్వరాలు పెరుగుతున్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి, జ్వర బాధితులకు వైద్యం అందించాలని మంత్రి అన్నారు.

వాతావరణ మార్పులతో రోగాలు..
మధ్యాహ్నం ఉక్కపోత.. రాత్రైతే చలి ప్రభావంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వైద్యులు సూచిస్తున్నారు. మరో వారం, పదిరోజుల పాటు వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి తెలిపారు. మధ్యాహ్నం పూట ఎండలు దంచికొడతాయని.. రాత్రి సమయంలో చలివాతావరణం ఉంటుందని చెప్పారు. ద్రోణుల ప్రభావంతోనే వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఫ్లూలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని.. అలాగే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఇన్ఫ్లూయింజా వైరస్ తో ప్రతి ఇంట్లో ఒకరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇలాంటి టైంలోనే విపరీతమైన ఎండ, చలితో రోగాలు మరింత ముదురుతున్నాయి. జ్వరం,దగ్గు,జలుబు, నీరసం గా ఉన్న పిల్లలను బడులకు పంపొద్దని రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

కరోనా ప్రభావం పోయినప్పటికీ ప్రస్తుతం హెచ్‌3ఎన్‌3, ఇతర ఫ్లూ కారణంగా ప్రజలు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని.. అయితే ఇది ప్రాణాంతకం కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యుల సూచనలు లేకుండా యాంటీబయోటిక్స్‌ వచ్చిలవిడిగా వినియోగించి ప్రమాదం కొనితెచ్చుకోవద్దని చెబుతున్నారు.