బంధాలను కలుపుతున్న ‘బలగం’!
ఒక్కో సినిమా ఒక్కో వర్గం ప్రజలకు నచ్చుతుంది. కొందరికి మాస్ సినిమాలు నచ్చితే, కొందరికి క్లాస్ సినిమాలు నచ్చుతాయి. కానీ అందరికీ నచ్చే అరుదైన సినిమాలు కొన్నే ఉంటాయి. వాస్తవిక ఆధారంగా సంస్కృతి, సంప్రదాయాలను కలబోసుకుని తెరకెక్కిన సినిమాలకు తప్పక ప్రేక్షకాదరణ దక్కుతుంది. అందుకు సరైన ఉదాహరణగా నిలుస్తోంది బలగం. వందల కోట్లు పెట్టి రూపొందించిన సినిమాలకు దక్కని ఆదరణ ఈ సినిమాకు దక్కుతోంది. చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్లో రికార్డులు సృష్టిస్తున్న సినిమా బలగం. సినిమా చూసిన ప్రతిఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన చిన్న సినిమాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది బలగం సినిమా. దిల్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఇక, ఈ సినిమాను పలు గ్రామాల్లో తెరలు వేసి ప్రదర్శిస్తున్నారు. అంతగా క్షేత్రస్థాయిలో ఆదరణ దక్కించుకుంది బలగం.
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించగా కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లు రాబడుతోంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా అన్నా చెల్లెలి మధ్య ఉండే అనుబంధాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు దర్శకుడు వేణు. ఇక, ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది తమ కుటుంబాలతో కలిసిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా చూసి కుటుంబానికి దగ్గరవుతున్నారు. చాలా మంది తమ కుటుంబాల్లో నెలకొన్న గొడవలు, విబేధాలను పరిష్కరించుకుని ఒక్కటవుతున్నారు.
తాజాగా బలగం సినిమా చూసి తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఒక కుటుంబం 45 ఏళ్ల తర్వాత ఒక్కటైంది. ఇబ్రహింపట్నంలోని ఇద్దరు అన్నదమ్ములు ఈ సినిమా చూసి పదిహేన్ల తర్వాత మాట్లాడుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు. ఈ సినిమా చూసి కంటతడి పెట్టని వాళ్లు లేరు. తమ అన్నాచెల్లెళ్లకు ఫోన్ చేసి పలకరించని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.
దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా థియేటర్లతోపాటు ఓటీటీలోనూ విశేష ఆదరణ దక్కించుకుంది. రికార్డు వ్యూస్‌తో దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డుల రావడం మొదలుపెట్టాయి. చిన్న సినిమాగా విడుదలై విశేష ఆదరణను దక్కించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో హవా కొనసాగిస్తోంది. తాజాగా అరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్- ఆమ్ స్టర్ డామ్ కార్యక్రమంలో మరో పురస్కారాన్ని దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు దీనిని దక్కించుకున్నారు. యూకే, యూఎస్, చైనా.. ఇలా పలు దేశాలకు చెందిన సినిమాలు, డైరెక్టర్స్‌ను వెనక్కి నెట్టి వేణు ఈ అవార్డును అందుకోవడం విశేషం. దీనిపై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ‘బలగం’ ఇప్పటికే ‘వాషింగ్టన్ డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్’, ‘ఒనికో ఫిల్మ్ అవార్డు’ వంటి పలు విదేశీ అవార్డులు అందుకుంది. మొత్తంగా తాజాగా వచ్చిన అవార్డుతో కలిపి ‘బలగం’ ఖాతాలో తొమ్మిది పురస్కారాలు చేరాయి. ఊరూరా తెరలపై ప్రదర్శిస్తున్నా, ఓటీటీలో అందుబాటులో ఉన్నా ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూసేందుకు థియేటర్లకే క్యూ కడుతున్నారు ప్రేక్షకులు. అంతటి ఆదరణ పొందిన ఈ సినిమాను ఆస్కార్ బరిలో నిలబెడతామని తాజాగా ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ వేదికపై మెరిసిన తెలుగు సినిమా మరోసారి ఆ ఘనత సాధిస్తుందో చూడాలి మరి.