రామ‌న‌వ‌మి వేడుక‌లో అప‌శృతి.. 13 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో శ్రీరామ నవమి రోజున ఘోర సంఘటన చోటుచేసుకుంది. పండుగ వేళ వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసింది. ఈక్రమంలో ఆలయ ప్రాంగణంలో పురాతన మెట్లబావి దగ్గరకు భక్తులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా చేరుకున్నారు. దీంతో బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 25 మంది లోపల పడిపోయారని అంచనా వేస్తున్నప్పటికీ.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి కోసం రెస్య్కూ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ మెట్ల బావి సుమారు 60 సంవత్సరాల క్రితం నాటిది కావడంతో.. బావి పైన నిర్మించిన గచ్చుపై భారం పడటంతో అది ఒక్కసారిగా కిందికి కూలిపోయింది. అధిక బరువు కారణంగా పైకప్పు పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

సుమారు 60 అడుగుల లోతున బావి.. నిండా నీరే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్ల బావి సుమారు 50 నుంచి 60 అడుగుల లోతు ఉందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. దీంతోపాటు బావి ఇరుకగా ఉండటం.. బావి నిండా నీరు ఉండటంతో లోపల పడిపోయిన వారిని రక్షించడం కష్టతరంగా మారిందని వారు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు 13 మంది చనిపోగా.. అందులో 10 మంది మహిళలు ఉన్నారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులు అక్కడ సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఒక్కొక్కరిగా బావి నుంచి బయటకు తీసుకొచ్చి వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. బావిలో ఎంతమంది చనిపోయారనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో.. బావిలో ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టేలా ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్రధాని మోదీ సంతాపం..
భక్తులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు. ఘటనలో మరణించిన వారి బంధువులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఇస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.