పాతబస్తీ శ్రీరామ్‌ శోభాయాత్రకు పోటెత్తిన భక్తులు

శ్రీరామనవమి సందర్బంగా ఇవాళ ప్రధాన పట్టణాల దగ్గరి నుంచి గ్రామాల వరకు శ్రీరామ్‌ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. అయితే.. హైదరాబాద్‌ పాతబస్తీలో నిర్వహించే శోభాయాత్రకు మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పటికే ఈ యాత్రను నిర్వాహకులు ప్రారంభించారు. దాదాపు 6.5 కిలోమీటర్ల పాటు జరిగే ఈ ర్యాలీలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్‌ నినాదాలతో పాతబస్తీ హోరెత్తుతోంది. పాతబస్తీలోని సీతారాంబాగ్ రామమందిరం నుంచి శ్రీరామ్ శోభాయాత్ర ప్రారంభం కాగా.. సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయమశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. సీతారాంబాగ్‌ ఆలయం – బోయగూడ నుంచి మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, దూల్‌పేట, పురానాపూల్‌, జుమేరాత్‌ బజార్‌, చుడిబజార్‌, బేగంబజార్‌ చత్రి, బర్తన్‌ బజార్‌, సిద్దంబర్‌ బజార్‌ మసీదు, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాలకు యాత్రగా చేరుకుంటుంది. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల మందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్, ఆక్టోఫస్ బలగాలతో శోభాయాత్రపై నిఘా పెట్టారు. శ్రీరామ్ శోభాయాత్రపై హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ… శ్రీరామ్ శోభాయాత్ర సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాటు చేశామన్నారు. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయమశాల వరకు సాగే ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు.