ప్రగతి భవన్‌కు కేసీఆర్.. కవిత అరెస్టు ఖాయమేనా?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగస్వామ్యం ఉందంటూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు మహిళా బిల్లును చట్ట సభల్లో పెట్టాలని.. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే కవిత పేర్కొన్నారు. దీనికోసం ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కవితను ముందుగానే పోలీసులు అరెస్టు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె ప్రగతి భవన్‌కు వెళ్తున్నట్లు సమాచారం. అక్కడ ఈడీ నోటీసులపై కేసీఆర్‌తో కవిత చర్చించనున్నట్లు తెలియవస్తోంది. కవితను అరెస్టు చేస్తే.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలిపేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
రిమాండ్ రిపోర్టులో పదే పదే కవిత పేరు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారుల విచారణలో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై పదే పదే తాను కవిత బినామీనంటూ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేసింది. ఈ నెల 10న ఢిల్లీ లోని జంతరమంతర్ వద్ద నిరాహార దీక్షలో కవిత పాల్గొననున్న నేపథ్యంలో ఈడీ నోటీసులు ఇవ్వడంపై… ఆ దీక్ష నిర్వహిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయిన తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చలు జరిపి ఢిల్లీ దీక్షపై కవిత ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఎంతంటే…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్ మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలు నడిచినట్లు సమాచారం. ఈ క్రమంలో సీబీఐ విచారణలో ఉన్న రామచంద్ర పిళ్లై కవిత పేరును విచారణ అధికారులు వద్ద పలుమార్లు ప్రస్తావించారని చెబుతున్నారు. దీంతో పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు ఇద్దరూ కవితకు బినామీలేనని ఈడీ స్పష్టంగా చెబుతోంది. పిళ్లైని రెండు రోజులపాటు విచారించిన తర్వాత సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. మంగళవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. తాము ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాలను కాపాడేందుకే వ్యాపారంలో చేరామని అరుణ్ పిళ్లై, ప్రేమ్‌రాహుల్ తమ విచారణలో అంగీకరించారని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం మేరకు తాము పెట్టుబడులు పెట్టినట్లు భాగస్వామిగా పిళ్లై అంగీకరించారు. అవన్నీ కవిత కోసమే చేసినట్లు వారు పేర్కొన్నారు. ఇక మద్యం కుంభకోణంలో పిళ్లైదే కీలకపాత్ర అని.. తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. దీంతో స్పందించిన న్యాయస్థానం.. ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. మరోవైపు కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును మరోసారి విచారణకు హాజరు కావల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే… కేంద్ర ఏజెన్సీలను ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయోగిస్తున్నారంటూ కేసీఆర్, ఇతర విపక్ష నేతలు కేంద్రానికి లేఖ రాసిన 24 గంటల్లోనే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నెల 10న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసుల జారీ చేసిన క్రమంలో దీనిపై సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.