David Warner: బాధ్యతలు అప్ప‌గించే సమయం ఆస‌న్న‌మైంది

David Warner: పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్ (81; 49 బంతుల్లో) పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే మూడు టీ20ల సిరీస్‌లో సత్తాచాటిన వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా గడ్డపై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇవాళే ముగిసిందని పేర్కొన్నాడు.

ఇటీవల టెస్టులు, వన్డేలకు వార్నర్ గుడ్‌బై పలికిన విషయం తెలిసిందే. టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నానని వార్నర్ చెప్పాడు. ‘మా కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు. తర్వాత జరగనున్న న్యూజిలాండ్ సిరీస్‌కు ఇంకా సమయం ఉంది. న్యూజిలాండ్ పర్యటన తర్వాత ఐపీఎల్, అనంతరం టీ20 వరల్డ్ కప్‌ జరగనుంది. కాబట్టి ఈ సమయాన్ని ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నా. ఇక నా ప్రయాణం ముగిసింది. మా దగ్గర యువకులు ఉన్నారు. వాళ్లకు బాధ్యతలు అందించే సమయం వచ్చింది’ అని వార్నర్ పేర్కొన్నాడు.

వార్నర్‌  (David Warner) సొంతగడ్డపై ఆడిన ఆఖరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం పెర్త్‌ వేదికగా ముగిసిన ఆఖరి టీ20లో 49 బంతుల్లోనే 81 పరుగులు చేసిన వార్నర్‌.. పొట్టి ఫార్మాట్‌లో 12 వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా నిలిచాడు. జాతీయ జట్టుతో పాటు పలు లీగ్స్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడుతున్న వార్నర్‌.. మూడో టీ20కి ముందు 48 పరుగుల దూరంలో ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో 81 పరుగులు చేయడంతో అతడు 12 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు.

ఇక, ఈ మ్యాచ్‌‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లకు 220 పరుగులు చేసింంది. ఆండ్రూ రసెల్ (71; 29 బంతుల్లో), రూథర్‌ఫర్డ్ (67*; 40 బంతుల్లో) అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 183 పరుగులే చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. మిచెల్ మార్ష్ (17; 13 బంతుల్లో)తో కలిసి వార్నర్ తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. వార్నర్ విధ్వంసానికి ఆసీస్ పవర్‌ప్లేలో 61 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఆరోన్ (16; 16 బంతుల్లో) కలిసి వార్నర్ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. అయితే స్వల్పవ్యవధిలోనే వీరిద్దరు పెవిలియన్‌కు చేరారు.

అనంతరం క్రీజులో వచ్చిన జోస్ ఇంగ్లిస్ (1), గ్లెన్ మాక్స్‌వెల్ (12; 14 బంతుల్లో) కూడా విఫలమయ్యారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (41*; 19 బంతుల్లో) పోరాడినప్పటికీ కొండంత లక్ష్యాన్ని ఆసీస్ అందుకోలేకపోయింది. అయితే వార్నర్ క్రీజులో ఉన్నంతసేపు ఆస్ట్రేలియా ఫేవరేట్‌గానే నిలిచింది. విండీస్ బౌలర్లలో షెఫార్డ్, రోస్టన్ ఛేజ్ చెరో రెండు వికెట్లు, హోస్సేన్ ఒక వికెట్ పడగొట్టారు.

మొత్తంగా పొట్టి క్రికెట్‌లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్నవారిలో ఓవరాల్‌గా ఐదో స్థానంలో ఉన్న వార్నర్‌.. ఆస్ట్రేలియా నుంచి మాత్రం ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డులెకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌, షోయభ్‌ మాలిక్‌, కీరన్‌ పొలార్డ్‌, అలెక్స్‌ హేల్స్‌లు వార్నర్‌ కంటే ముందున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌ వార్నర్‌. క్రిస్‌ గేల్‌ 343 మ్యాచ్‌లలో ఈ ఘనత అందుకోగా వార్నర్‌ 368 మ్యాచ్‌లలో చేశాడు. అలెక్స్‌ హేల్స్‌ (435 మ్యాచ్‌లు), షోయభ్‌ మాలిక్‌ (486)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.