దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లోనే ఉంచాలి… సీఎం జగన్‌ కీలక తీర్మానాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ అధికార ప్రభుత్వం రెండు కీలక తీర్మానాలను అసెంబ్లీలో ఆమోదించింది. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తీర్మానాలనూ కేంద్రానికి పంపుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఇందులో ప్రధానంగా దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలోనే ఉంచాలని ఆయన పేర్కొన్నారు. కేవలం మతం ఆధారంగా వారికి రిజర్వేషన్‌ తొలగించడం భావ్యం కాదని పేర్కొన్నారు. అలాగే.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని.. ఉమ్మడి ఏపీలో దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ హయాంలో తీర్మానం చేశారని… మళ్లీ నేడు తీర్మానం చేస్తున్నాం అని జగన్ తెలిపారు. మతం మారినంత మాత్రాన ఎస్ఈల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారవని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని మరో తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వీటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపనున్నట్లు జగన్‌ చెప్పారు. పాదయాత్రలో.. ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు తనను కోరారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో ఆ కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్‌ తెలుసుకుందన్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత కమిటీ నివేదిక ఆధారంగా తీర్మానం చేశామని సీఎం జగన్‌ తెలిపారు. ఎస్టీలు తనను గుండెల్లో పెట్టుకున్నారని ఈ సందర్బంగా జగన్‌ తెలిపారు. తాను కూడా వారిని గుండెల్లో పెట్టకుంటానని స్పష్టం చేశారు.