Covid: ముగింపు దశకు!
ప్రస్తుతం దేశంలో మరోసారి కరోనా కేసుల ఉదృతి పెరుగుతోంది. దీంతో నాలుగో వేవ్ తప్పదా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో వెయ్యిలోపు కేసులు నమోదు కాగా.. ఇప్పుడు రోజుకి ఆరు వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొవిడ్ మరోసారి ఇబ్బందులను కలుగుచేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ.. దేశంలోని అన్ని రాష్ట్రంల్లోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించి… కేసులు పెరుగుదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇక ఇది ఇలా ఉండగా.. కొవిడ్ ముగింపు దశకు వచ్చిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందుకే కేసులు పెరుగుతున్నాయని .. వ్యాధి తీవ్రత అంతగా ఉండదని అంటున్నారు.
కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుంటాయి..
కొవిడ్ మహమ్మారి భారత్‌లో ఎండెమిక్ దశకు అంటే ముగింపు దశకు చేరుకున్నట్లు భావించొచ్చని నిపుణులు చెబుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల్లో పెరుగుదలే అందుకు కారణమని తెలిపారు. సాధారణ జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ఇతర కరోనా వైరస్‌ల తరహాలోనే ప్రస్తుతం కొవిడ్ కారక సార్స్-కొవ్-2 ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంటుందని… అయితే డెల్టా వేరియంట్ విజృంభణ (2021) నాటి తరహాలో భారీ ఉద్ధృతి మళ్లీ వచ్చే అవకాశాలు మాత్రం లేవని హరియాణాలోని అశోకా విశ్వవిద్యాలయానికి చెందిన భౌతికశాస్త్రం, జీవశాస్త్ర విభాగాల డీన్ (పరిశోధన) ప్రొఫెసర్ గౌతమ్ ఐ.మేనన్ వివరించారు. ‘‘రాబోయే కొన్ని వారాల్లో కేసులు మరింతగా పెరుగుతాయి. కానీ డెల్టా విజృంభణ నాటి స్థాయి ఉద్ధృతి మళ్లీ రాదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కేసుల తీవ్రత తక్కువే’’ అని మేనన్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులపై పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్, రోగనిరోధక శాస్త్ర నిపుణుడ సత్యజిత్ రథ్ కూడా స్పందించారు. కొత్త వేరియంట్ల పుట్టుక, కొవిడ్ టీకాల ప్రభావం తగ్గుదల, పర్యావరణ సంబంధిత కారణాల వల్ల ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని.. కానీ భవిష్యత్తులో అవి అంత ప్రభావం చూపకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు ముఖ్యంగా ఇప్పటికే కోవిడ్ భారిన పడిన వారు వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్బిణులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.